అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీసులపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్తెనపల్లిలో యూత్ కాంగ్రెస్ నేతలపై పోలీసులు, వైసీపీ శ్రేణుల దాడిని వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. వైసీపీ కండువా లేని కార్యకర్తలే మన పోలీసులు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసులు ఉన్నది ప్రజల కోసమా లేక అధికార పార్టీ అడుగులకు మడుగులు ఒత్తడం కోసమా ? అని నిలదీశారు. 


ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపితే బూట్లతో తొక్కిస్తారా ? గొంతు పిసికి చంపాలని చూస్తారా ? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. వైసీపీ గూండాలను పక్కన పెట్టి మరి దాడులు చేయిస్తారా ? మీరు పోలీసులా లేక YCP కిరాయి మనుషులా ? అని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. యూత్ కాంగ్రెస్ నేతల్ని ఇష్టారాజ్యంగా కొట్టడానికి ఎవరిచ్చారు మీకు హక్కు. కండువా లేని వైసీపీ కార్యకర్తలు మన పోలీసులు అన్నారు.  సత్తెనపల్లిలో యూత్ కాంగ్రెస్ నాయకులపై జరిగిన దాడి ఘటన పై వెంటనే డీజీపీ స్పందించాలన్నారు. విచక్షణారహితంగా కొట్టిన పోలీస్ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.


మంత్రి అంబటి నివాసం ముట్టడికి యత్నం
జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో జగన్, వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఏపీ యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో శుక్రవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని మంత్రి అంబటి రాంబాబు నివాసాన్ని యూత్ కాంగ్రెస్ నేతలు ముట్టడికి యత్నించారు. జాబ్ క్యాలెండర్ పై ప్రశ్నిస్తూ, నిరుద్యోగులను మోసం చేశారంటూ అంబటి ఇంటి ముందు యూత్ కాంగ్రెస్ నేతలు బైఠాయించి ప్లకార్డులతో నిరసనకు దిగారు. జగన్ ఇచ్చింది మెగా డీఎస్సీ కాదు, దగా డీఎస్సీ అని ఆరోపించారు. 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ విడుదల చేయాలని ఎన్‌ఎస్‌యూఐ డిమాండ్‌ చేసింది. మంత్రి అంబటి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు అక్కడికి వెళ్లి యూత్ కాంగ్రెస్ నేతల్ని ఎక్కడికక్కడ ఈడ్చిపారేశారు. వారిని బలవంతంగా అక్కడి నుంచి పోలీసు వాహనాలలో పీఎస్ కు తరలించారు.