YS Sharmila post on YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన సభకు హాజరు కాకపోవడం పిరికితనం, చేతగానితనం, అహంకారం వల్లే అని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తా అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాలాకోరుతనం అని అన్నారు. ఎక్స్‌లో షర్మిల తన సోదరుడు జగన్ ను విమర్శిస్తూ సుదీర్ఘ పోస్టు చేశారు.


సిగ్గు సిగ్గు!! మాజీ ముఖ్యమంత్రి జగన్. శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు! ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ గారి అజ్ఞానానికి నిదర్శనం. ఇంతకుమించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడ కనపడవు, వినపడవు. మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు, జగన్ మోహన్ రెడ్డి గారు, కానీ మిమ్మల్ని ఎన్నుకుని, అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా, వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లింది. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళాకోరుతనం. 


MLA = Member of Legislative Assembly, not Member of Media Assembly. ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుక అవ్వడానికా, లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా?


ఐదేళ్ల పాలన అంతా అవినీతి, దోపిడి అని... రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారని... నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే... తాపిగా ప్యాలస్ లో కూర్చుని మీడియా మీట్ లు పెట్టడానికి కాదు ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేను చేసింది. గత మీ పాలనపై విమర్శలకు, అసెంబ్లీలో ఆన్ రికార్డు సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా..? ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ అఫ్ ది హౌస్ లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా? అసెంబ్లీకి పోనని చెప్పే మీరు, ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారు. వెంటనే రాజీనామా చేయండి!! 


బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు, ఆఫీసుకు పోననే పనిదొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారు. ప్రజాతీర్పును గౌరవించకుండా, అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో, అంటార్టికా మంచులోకే పోతారో ఎవడికి కావాలి అప్పుడు. అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణం మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలి అని ఏపీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.