Jagan on Delimitation | అమరావతి: డీలిమిటేషన్ ప్రతిపాదన ద్వారా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని, చట్టాల రూపకల్పనలో మన ప్రాధాన్యత అవసరమే లేకుండా పోతుందని చెన్నైలో స్టాలిన్ నేతృత్వంలో విపక్ష నేతల సమావేశం జరుగుతోంది. ఈ సమయంలో ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) డీలిమిటేషన్ ప్రక్రియపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. నియోజకవర్గాల పునర్ విభజన ప్రజాస్వామ్య సమాఖ్య స్ఫూర్తిని నిలబెట్టాలన్నారు. లోక్‌సభ లేక రాజ్యసభలో ఏ రాష్ట్రానికీ సీట్ల వాటా తగ్గకుండా డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలని కోరారు. ప్రతి ప్రాంతం యొక్క గొంతకకు సమాన ప్రాధాన్యం కల్పించేలా చూడాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో వైఎస్ జగన్ పేర్కొన్నారు. 

జగన్ లేఖలో ఏం ప్రస్తావించారంటే..లోక్‌సభ, రాజ్యసభలో ఏ రాష్ట్రానికి ప్రాతినిథ్యం తగ్గకూడదు. సీట్ల సంఖ్య విషయంపై కేంద్రం దక్షిణాదికి అన్యాయం జరగకుండా చూడాలి. దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. డీలిమిటేషన్ ద్వారా కొన్ని రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయి. దాని వల్ల చట్టాల రూపకల్పన, సవరణలలో దక్షిణాది రాష్ట్రాల ప్రభావం ఏమాత్రం ఉండదు. రాజకీయంగానే కాదు ప్రజల ప్రయోజనాల్ని ఇది దెబ్బతీస్తుంది. డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే కనుక ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా జాగ్రత్తగా చేయాలి. 84వ రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్ ప్రక్రియ జరగనుంది. 2026 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలి. కోవిడ్19 కారణంగా 2021లో ప్రారంభించాల్సిన జనాభా లెక్కలు తేల్చలేదు. జనాభా సర్వే లెక్కలు తేల్చిన తరువాత నియోజకవర్గాల పునర్ విభజన ప్రక్రియ ఉంటుంది.

జనాభా పెరుగుదలలో హెచ్చుతగ్గులు

జనాభా నియంత్రణ కోసం పలు రాష్ట్రాలు అనేక విధానాలు అమలు చేశాయి. దీని వల్ల వివిధ రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల హెచ్చుతగ్గులున్నాయి. దేశవ్యాప్తంగా జనాభా వృద్ధి ఒకే తరహాలో లేదు. దీని వల్ల డీమిలిటేషన్‌ ఆందోళనకు దారి తీస్తోంది. 42, 84వ రాజ్యాంగ సవరణల ద్వారా ఆయా రాష్ట్రాలకు సీట్ల కేటాయింపును నిలిపేశారు. దేశ జనాభాలో ఆయా రాష్ట్రాల వాటా 1971 నాటి స్థాయికి చేరుకుంటుందని భావించారు. కానీ, 2011 జనాభా లెక్కలు చూస్తే జనాభా వృద్ధి, దాని అంచనాలు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా లేవు. 1971, 2011 మధ్య 40 ఏళ్లలో దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గింది.

1971 లెక్కల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల జనాభా వృద్ధి రేటు 24.08 శాతం, 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా వృద్ధి రేటు 20.88 శాతం. ఇప్పుడున్న జనాభా లెక్కలను ఆధారంగా చేసుకుని డీలిమిటేషన్‌ ప్రక్రియ జరిగితే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దామాషా ప్రకారం అన్ని రాష్ట్రాలకు సీట్ల పెరుగుదల అంశాన్ని దృష్టిలో ఉంచుకుని డీలిమిటేషన్‌ చేపడతామని హోం మంత్రి అమిత్‌షా హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు.  ఆర్టికల్‌ 81 (2) (ఎ) ప్రకారం జనాభా ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు సీట్ల కేటాయింపు జరగాలి. ఈ నిబంధనతో హోంమంత్రి అమిత్‌షా ఇచ్చిన హామీని అమలులో అడ్డంకులు ఏర్పడతాయి. అందువల్ల దామాషా ప్రకారం ప్రతి రాష్ట్రానికి సీట్ల కేటాయింపుపై రాజ్యాంగ సవరణ చేయాలి. దాంతో ఆయా రాష్ట్రాల ప్రాతినిథ్యం తగ్గుతుందనే అంశం ఉత్పన్నం కాదు అని లేఖలో జగన్ పేర్కొన్నారు.