Jagan on AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తాడేపల్లిలో నిర్వహించిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు , ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియపై ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కీలక సమావేశంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికార బలంతో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగించే అవకాశం ఉందన్నారు. ఇది కేవలం ఓటర్ల జాబితా మార్పు కాదు.. మన పార్టీ అస్తిత్వానికి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల విజయానికి పునాది అని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై 24 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఉన్న సమయాన్ని యుద్ధప్రాతిపదికన ఉపయోగించుకోవాలని జగన్ ఆదేశించారు. ఎక్కడ ఓటు తొలగింపునకు గురైనా తక్షణమే ఫామ్-7 ద్వారా రాతపూర్వక అభ్యంతరాలు తెలియజేయాలని, దీనికోసం నియోజకవర్గ స్థాయిలో పార్టీ లీగల్ సెల్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. అక్టోబర్ 1న విడుదలయ్యే తుది ఓటర్ల జాబితానే రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ మరియు పంచాయతీ ఎన్నికలకు ప్రామాణికమని జగన్ స్పష్టం చేశారు. అక్టోబర్ 1 నాటికి మన ఒక్క ఓటు మిస్ అయినా వచ్చే ఐదేళ్ల రాజకీయంపై దాని ప్రభావం ఉంటుంది. అందుకే ప్రతి బూత్ ఇన్‌ఛార్జ్ తమ పరిధిలోని ఓట్లను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలి అని దిశానిర్దేశం చేశారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ భవిష్యత్తుకు అత్యంత కీలకమని, వీటిలో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని జగన్ పిలుపునిచ్చారు. ఏకగ్రీవం అయితే సీరియస్ గా తీసుకుంటానని హెచ్చరించారు. చంద్రబాబు రెండేళ్ల పాలనపై 'వెన్నుపోటుకు రెండేళ్లు' పేరుతో YCP అధినేత YS జగన్ బుక్ లెట్ విడుదల చేశారు. జూన్ 4 నుంచి 12 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 4న మండల కేంద్రాల్లో నిరసనలు, 8 లేదా 9న నియోజకవర్గ కేంద్రాల్లో సదస్సులు, 12న ర్యాలీలు చేపట్టాలని YSRCP శ్రేణులకు సూచించారు. చంద్రబాబుది వెన్నుపోటు కాదని వెన్నుపోట్లని, ప్రజల నిరసనల సెగలు ఆయనకు తగలాలని హితబోధ చేశారు.
