YSRCP Demand CBI Inquiry DSC 2026: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నిర్వహించిన 16,000 ఉపాధ్యాయ పోస్టుల ‘మెగా డీఎస్సీ’ నియామక ప్రక్రియపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఇదొక ప్రణాళికాబద్ధమైన ‘మెగా స్కామ్’ గా సాగిందని ఆయన ఆరోపించారు. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలను అపహాస్యం చేస్తూ, పారదర్శకతను పూర్తిగా తుడిచిపెట్టేసి, ఈ రిక్రూట్‌మెంట్‌ను ఒక ధనార్జన యంత్రంగా మార్చేశారని జగన్ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఇంతటి భారీ అక్రమాలకు పాల్పడినందున, దీనిపై స్వతంత్ర సంస్థ అయిన సీబీఐ   చేత విచారణ జరిపించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.

Continues below advertisement

ఈ కుంభకోణంలో దాగి ఉన్న ప్రధాన అక్రమాలను జగన్ సాక్ష్యాలతో సహా వివరిస్తూ.. పరీక్షల నిర్వహణలో దశాబ్దాలుగా వస్తున్న భద్రతా ప్రమాణాలను చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టిందని దుయ్యబట్టారు. ప్రశ్నపత్రాల తయారీ  , పరీక్షల నిర్వహణ బాధ్యతలను వేర్వేరుగా ఉంచే సంప్రదాయాన్ని బద్దలు కొట్టి, రెంటినీ ఒకే అధికారికి అప్పగించారని విమర్శించారు. అంతేకాకుండా, అత్యంత రహస్యంగా ఉంచాల్సిన ప్రశ్నపత్రాల అప్‌లోడింగ్ విధులను అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కట్టబెట్టారని, అందువల్లే ఎస్సీఈఆర్‌టీలో పనిచేసే ఒక అవుట్‌సోర్సింగ్ ఉద్యోగికి ఈ పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ఆరోపించారు. ఆ తర్వాత సదరు అభ్యర్థి డేటాను మెరిట్ లిస్ట్ నుండి తొలగించడం, అతను కోర్టును ఆశ్రయించడం వంటి పరిణామాలు పక్కాగా ‘పేపర్ లీక్’ జరిగిందనడానికి ప్రత్యక్ష నిదర్శనాలని జగన్ పేర్కొన్నారు.  

 "చంద్రబాబు, లోకేష్ ముందే రచించిన ఒక పాలసీ బ్లూప్రింట్ ప్రకారం.. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు డీఎస్సీ రాతపరీక్ష నుంచి మినహాయింపు ఇస్తూ జీవోలు తెచ్చి, రిక్రూట్‌మెంట్ ముగిశాక మళ్లీ పాత పాలసీని పునరుద్ధరించారు. అంటే బ్యాక్‌డోర్ ఎంట్రీ ద్వారా తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికే ఈ దొంగచాటు జీవోల నాటకమాడారు" అని వైఎస్ జగన్ ఆరోపించారు.   ఫలితాల ప్రకటనలోనూ తీవ్రమైన గోప్యత పాటించారని, కలెక్టరేట్ నోటీస్ బోర్డుల్లో మెరిట్ లిస్టులు పెట్టకుండా కేవలం ఆన్‌లైన్ విధానానికే పరిమితం చేసి అభ్యర్థులను అయోమయంలోకి నెట్టారని జగన్ ఆరోపించారు. సెలక్షన్ రూల్స్ 2025 లోని రూల్ 20 ని పూర్తిగా ఉల్లంఘించారని, 1:1 నిష్పత్తిలో పిలిచి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఎంతో మంది అభ్యర్థుల పేర్లను ఫైనల్ సెలక్షన్ లిస్ట్ నుండి దారుణంగా తొలగించారని మండిపడ్డారు. అర్హులైన ఎంతో మంది మెరిట్ అభ్యర్థులు, నిజమైన క్రీడాకారులు ఈ మోసపూరిత విధానాల వల్ల రోడ్డున పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  

ఇక ఉపాధ్యాయ పోస్టుల కోసం సాగిన ఒక ఆడియో/వీడియో బేరసారాల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపినప్పటికీ, ప్రభుత్వం కేవలం ఒక టోకెన్ కేసు నమోదు చేసి నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చిందని.. కనీసం ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడి పేరు కూడా చేర్చకుండా కేవలం  అనుమానితుడు  అని పేర్కొనడం వెనుక పెద్దల హస్తం స్పష్టంగా కనిపిస్తోందని జగన్ ట్వీట్ చేశారు. ఈ మెగా స్కామ్   మూలాలు నేరుగా ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి వద్దే ఉన్నాయని, రాష్ట్ర పరిధిలోని దర్యాప్తు సంస్థలు వీరి కిందే పనిచేస్తాయి కాబట్టి నిష్పక్షపాత విచారణ సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. లక్షలాది మంది నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే కేంద్ర సంస్థ అయిన సీబీఐతోనే సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.