విజయనగరం: భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram Airport)లో తొలి విమానం ప్రయోగాత్మక ల్యాండింగ్ విజయవంతం కావడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తరాంధ్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఒక సందేశాన్ని షేర్ చేసుకున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ కావడం తెలిసిందే.
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మైలురాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులకు భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం తొలి వ్యాలిడేషన్ ఫ్లైట్ విజయవంతమైన సందర్భంగా సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. రాష్ట్ర విమానయాన రంగంలో నేడు ఒక కొత్త మైలురాయి అని, ఇది ప్రాంతీయ అనుసంధానతను బలోపేతం చేయడమే కాకుండా, ఉత్తరాంధ్ర ప్రాంతం ఆర్థికంగా ఎదిగేందుకు మరింత ఊతమిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబుఆంధ్రప్రదేశ్ ప్రగతి, అభివృద్ధి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న దార్శనికత, నాయకత్వం, నిబద్ధతకు ఈ సందర్భంగా చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. 2014-2019 మధ్య కాలంలో ఎన్డీఏ (NDA) ప్రభుత్వ హయాంలోనే ఈ విమానాశ్రయానికి ప్రణాళికలు రూపొందించి, శ్రీకారం చుట్టామని తొలి విమానం ల్యాండ్ అయిన సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. అన్ని పనులను పూర్తి చేసుకుని, రాబోయే జూన్ నెల నుండి ప్రజల కోసం వాణిజ్య విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
విజన్ వైజాగ్ దిశగ కీలక అడుగు పడింది.. వైఎస్ జగన్విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండ్ కావడంపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ‘విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తొలివిమానం ల్యాండింగ్ కావడం ఏపీ అభివృద్ధిలో ఒక మైలురాయి. Vision Vizag లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడింది.
భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంలో ఎంతో కృషి చేసిన GMR గ్రూప్‌కు నా హృదయపూర్వక అభినందనలు. వైసీపీ పాలన కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించడంతో పాటు ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం, భూసేకరణ కోసం రూ. 960 కోట్లు ఖర్చు చేసి ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేశాం. ఎయిర్ పోర్టు నిర్మాణానికి సంబంధించిన ప్రధాన పనుల్లో అగ్రభాగం వైసీపీ హయాంలోనే పూర్తయింది. ఆ రోజు మేం చేసిన కృషి నేడు ఈ కీలక మైలురాయిని చేరుకునేందుకు కారణమైంది.
విశాఖపట్నం పోర్టును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే భోగాపురం ఎయిర్‌పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్ట్‌కు 2023 మార్చిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కృషి, సహకారం నాకు ఇప్పటికీ గుర్తుందని’ వైఎస్ జగన్ తన పోస్టులో పేర్కొన్నారు.