Rayapati In  YSRCP :  టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు వైఎస్ఆర్‌సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.  ఇప్పటి వరకు ఆయన తెలుగు దేశం పార్టీలో  ఉన్నారు. వయోభారంతో పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. కన్నా లక్ష్మినారాయణ తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారని అంటున్నారు. కాంగ్రెస్ లో కన్నా, రాయపాటి ఉన్నప్పటి నుండి వారి మధ్య వివాదాలున్నాయి.  ఎవ్వరూ ఊహించని విధంగా కన్నా లక్ష్మినారాకయణ  తెలుగు దేశం పార్టీలో చేరిపోయారు. ఆయనకు సత్తెనపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బాద్యతలను  చంద్రబాబు అప్పగించారు. 

కన్నా టీడీపీలో చేరడాన్ని స్వాగతించిన రాయపాటి శ్రీనివాస్ 

అయితే తెలుగు దేశంలోకి కన్నా రావడంతో గుంటూరు రాజకీయాల్లో మార్పులు వచ్చాయని భావిస్తున్నారు.  కన్నా రాకను రాయపాటి సాంబశివరావు సోదరుడు రాయపాటి శ్రీనివాస్ స్వాగతించారు. కన్నా ఇంట్లో జరిగిన విందు సమావేశానికి కూడా రాయపాటి శ్రీనివాస్ వెళ్ళారు. దీంతో కన్నా, రాయపాటి కుటుంబాల మధ్య ఉన్న రాజకీయ వైరం క్లియర్ అయ్యిందని అంతా భావించారు.  ఇంతలోనే రాయపాటి పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ఊహాగానాలు జోరు మీద సాగుతున్నాయి.

సత్తెనపల్లిలో కన్నాపై రాయపాటి బెటరని వైసీపీ భావిస్తోందా ?   ఉమ్మడి గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి రాజకీయం రసవత్తరంగా మారబోతోంది. ఇప్పటికే సత్తెనపల్లి నియోజకవర్గానికి తెలుగు దేశం  తరపున కన్నా లక్ష్మినారాయణకు చంద్రబాబు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల్లో  కన్నా సత్తెపల్లి నుండి పోటీ చేసేందుకు  లైన్ క్లియర్ అయ్యిందని అంటున్నారు.  eఅధికార వైఎస్ఆర్ కాంగ్రెస్  నుండి ప్రస్తుతం సిట్టింగ్ గా ఉన్న మంత్రి అంబటి రాంబాబు కు తిరిగి సీట్ కేటాయించే విషయమై కొంత వరకు గందరగోళ పరిస్దితులు ఉన్నాయి. సత్తెపల్లిలో కన్నాను ఓడించేందుకు రాయపాటిని తెర మీదకు తీసుకువస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.  ఎన్నికలకు ముందే ఈ విషయం పై క్లారిటి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 

వైసీపీ హైకమాండ్ టచ్‌లోకి రాయపాటి !                                                                               

రాయపాటిని గుంటూరు పార్లమెంట్ స్దానం నుండి పోటీ చేయించటం లేదా, రాయపాటి కుమారుడిని సత్తెనపల్లి నుండి వైసీపీ తరపున పోటీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇక ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్  లో కీలకంగా ఉన్న మంత్రి అంబటి రాంబాబును ఈ సారి సీటు మార్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందులో భాగంగానే అంబటిని కృష్ణా జిల్లా అవనిగడ్డకు మార్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.  కృష్ణా, గుంటూరు  జిల్లాలో పొలిటికల్ లెక్కలను పరిగణంలోకి తీసుకొని రాయపాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టిలోకి ఆహ్వనిస్తున్నారని అంటున్నారు. అయితే ఇప్పటి వరకూ ఈ విషయంలో స్పష్టత రాలేదు. రాయపాటి కుటుంబం తరపున ఎవరూ స్పందించలేదు.