YCP leader made sensational allegations against a female IAS officer : సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారిణిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె రోజుకు లక్షన్నర ఖరీదైన చీర కడతారని, ఆమెకు రూ.50 లక్షల విలువైన విగ్గులు ఉన్నాయని తనకు తెలుసని ప్రకటించారు. ఆమె అవినీతి ఆనకొండ అన్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఈ వ్యక్తిగత ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. వైసీపీ హయాంలో తిరుపతిలో రూ.2 వేల కోట్ల టీడీఆర్ బాండ్ల స్కాం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అవకతవలకు ఆమే కారణం అని భూమన ఆరోపిస్తున్నారు.
సర్వీసులో ఎప్పుడూ డబ్బు సంపాదనపైనే దృష్టి పెట్టారన్న భూమన అవినీతి అనకొండలాంటి అధికారిణి రాష్ట్రంలోని మంత్రులందరినీ పూచిక పుల్లల్లా చూస్తూ, తన శాఖ మంత్రులను కూడా లెక్కచేసేది కాదన్నారు. డబ్బు సంపాదించడమే తప్ప, ఏ నైతిక విలువలు లేని మనిషని మండిపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఓ తాటకిలా కింది అధికారుల పట్ల వ్యవహరించిందని ఆరోపించారు. ఆమె రోజూ ధరించే చీర ఖరీదు రూ.1.50 లక్షలు అని .. ఆమె విగ్గులు అరకోటి ఉంటాయన్నారు. గత 30-35 ఏళ్లుగా ఎక్కడ పని చేసినా వందలు, వేల కోట్ల రూపాయిలు దండుకుందన్నారు. , అత్యున్నత న్యాయస్థానం కూడా ఆమె నీతి గురించి వెటకారం చేసిందని భూమన గుర్తు చేశారు.
పురపాలక శాఖను చూసిన వై.శ్రీలక్ష్మి - ఆమెనే టార్గెట్ చేసిన భూమన ?
భూమన కరుణాకర్ రెడ్డి ఆ ఐఏఎస్ పేరు చెప్పలేదు కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో ఆమె పురపాలక శాఖ బాధ్యతలు పర్యవేక్షించారని చెప్పారు. ఆ బాధ్యతలు చూసింది ఐఏఎస్ శ్రీలక్ష్మి . 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మాజీ కార్యదర్శిగా పని చేశారు. ఆమెపై అక్రమ మైనింగ్ కేసులో CBI దర్యాప్తు జరిగింది. 2011లో అరెస్ట్ అయ్యారు. తర్వాత బెయిల్ మీద విడుదలయ్యారు. విభజన తర్వాత తెలంగాణకు కేటాయించినా.. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ క్యాడర్ కు వచ్చారు. వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఆమెకు.. ప్రస్తుత ప్రభుత్వంలో పోస్టింగ్ ఇవ్వలేదు.
మహిళా ఐఏఎస్‌పై అలాంటి వ్యాఖ్యలు చేస్తారా ? భూమన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు తిరుపతిలో రెండు వేల కోట్ల రూపాయల విలువైన టీడీఆర్ బాండ్ల స్కామ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిపై విచారణ జరుగుతోంది. ఈ ఆరోపణలు తమపై రావడానికి ఆ ఐఏఎస్ అధికారిణే కారణం అని భూమన అంటున్నారు. అయితే జగన్ కారణంగా జైలుకు వెళ్లి ..కెరీర్ పరంగా మొత్తం కోల్పోయిన ఆమెపై ఇప్పుడు నిందలు వేస్తూ.. వైసీపీ నాయకులు ఘోరంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ వర్గాలంటున్నాయి. ఐఏఎస్ అధికారణిపై భూమన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపే అవకాశాలు ఉన్నాయి.