Gannavaram TDP incharge : ఎన్టీఆర్ జిల్లా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గా యార్లగడ్డ వెంకట్రావును ఆ పార్టీ ఖరారు చేసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ విషయాన్ని స్వయంగాప్రకటింంచారు. గన్నవరం నియోజకవర్గంలో ‘యువగళం’ పాదయాత్ర కొనసాగుతోంది. దీనిలో భాగంగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో నారా లోకేశ్ సమక్షంలో వై వైసీపీకి చెందిన పలువురు నేతలు టీడీపీలో చేరారు. వీరిలో సిట్టింగ్ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, సర్పంచ్‌లు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా గన్నవరం పార్టీ ఇన్‌ఛార్జ్‌గా వెంకట్రావును నియమించినట్లు లోకేశ్ ప్రకటించారు.
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓటమి కోసం తామంతా కలసి కట్టుగా పనిచేస్తామని యార్లగడ్డ వెంకట్రావు ప్రకటించారు. గన్నవరం టీడీపీ కంచుకోట అని మరోసారి అక్కడ టీడీపీ జెండాను ఎగరేస్తామన్నారు. ఆత్మాభిమానంతోనే టీడీపీలో చేరానని.. వంశీ వెంట టీడీపీ నేతలు ఎవరూ వెళ్లలేదన్నారు. తాము రౌడీయిజం చేయడానికి రాలేదని.. రాజకీయం కోసమే వచ్చామన్నారు. కొత్త, పాత కలయికల్ని సమన్వయం చేసుకుంటూ వెళ్తానని వెంకట్రావు ప్రకటించారు. ఏ ఒక్కరికి సమస్య ఉన్నా నేరుగా తనకి చెప్పాలని కార్యకర్తలకు ఆయన వేదికపై నుంచి సూచించారు.
గన్నవరం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ తర్వాత వైసీపీకి మద్దతు పలికారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి గన్నవరం లో ఇంచార్జ్ లేరు. మధ్యలో కొన్నాళ్ల పాటు బచ్చున అర్జునుడును సమన్వయకర్తగా నియమించారు. కానీ ఆయనకు అనారోగ్యం కారణం ఎక్కువగా తిరగలేకపోయారు. దీంతో గన్నవరంలో టీడీపీ కార్యక్రమాలు పెద్దగా సాగలేదు. తర్వాత బచ్చుల అర్జునుడు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ తర్వాత త్రీ మెన్ కమిటీని టీడీపీ హైకమాండ్ నియమించింది. ఈ క్రమంలో గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసుపైనా వల్లభనేని వంశీ అనుచరులు దాడులు చేశారు. స్వయంగా వంశీ ఈ దాడులు చేయించారన్న ఆరోపణలు వచ్చాయి.
ఈ పరిణామాల మధ్య బలమైన నేత కోసం అన్వేషిస్తున్న టీడీపీకి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు.. తనకు ప్రత్యామ్నాయం చూపించలేదన్న అసంతృప్తితో వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆయన బలమైన అభ్యర్థి అవుతారని భావించడంతో వెంటనే పార్టీలో చేర్చుకుని ఇంచార్జ్ గా ప్రకటించారు. దూకుడుగా ఉండే వెంకట్రావు.. వల్లభనేని వంశీకి సరైన ప్రత్యర్థి అవుతారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.