Yanmala advise To TDP Governament : వైసీపీ నేతలు ఐదేళ్ల కాలంలో అడ్డగోలుగా దోచుకున్నారని  వారి నుంచి తెలుగు ప్రజల సంపదను స్వాధీనం చేసుకోవాలని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు టీడీపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. వైసీపీ నేతల అక్రమార్జనను రెవెన్యూ రికవరీ చట్టం లేదా ప్రత్యేకమైన చట్టం ఉపయోగించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని యనమల సూచించారు. గడిచిన ఐదేళ్లలో జగన్ సర్కారు చేసిన ఆర్థిక నష్టాన్ని పూడ్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన పురోగతి చర్యలు అభినందనీయమని కొనియాడారు. యనమల కొత్త ప్రభుత్వానికి 15 అంశాలను సూచించారు. మ్యానిఫెస్టో హామీల అమలుకు తోడ్పడుతూనే రాష్ట్ర ఖజానా, ఆర్థిక ఆరోగ్యాన్ని తన సూచనలు మెరుగుపరుస్తాయన్నారు.  


ఆర్థిక నిర్వహణ కోసం పలు సూచనలు చేసిన యనమల                  


వీటితో పాటు యనమల పలు సూచనలు చేశారు.  బిల్లుల చెల్లింపులకు సీఎఫ్‌ఎంఎస్‌ వాడాలన్నారు.   ఆదాయాల క్రమబద్ధీకరణ, సహేతుకమైన స్థిర రుణాలు, ఇప్పుడు ఉన్నదాని కంటే ఎక్కువ గ్రాంట్-ఇన్-ఎయిడ్ తదితర అంశాలపై కేంద్రాన్ని అభ్యర్థించాలని సూచించారు. వేస్‌ అండ్ మీన్స్, ఓడీని జాగ్రత్తగా వినియోగించుకోవాలన్నారు. అలాగే  అర్హులకు మాత్రమే సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలి. తద్వారా వ్యయాలు తగ్గించుకోవాల్సి ఉందన్నారు. మూలధన వ్యయంలో లీకేజీలను అరికట్టాలి, ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక గమ్యస్థానంగా మార్చాలని.. సహజ వనరులను రక్షించాలన్నారు.  ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలోని ఆర్థిక క్రమశిక్షణ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు 


ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయన్న యనమల                           


తన సూచనలతో  ద్రవ్య లోటును ప్రస్తుతానికి నియంత్రించాలని దీనివల్ల రాబోయే సంవత్సరాల్లో లోటు తగ్గుతుందన్నారు. అవినీతిని అరికట్టడం ద్వారా రాష్ట్రంలో ఆర్థిక పురోగతి, శ్రేయస్సుకు అనుకూలమైన వాతావరణం నెలకొల్పవచ్చుననితెలిపారు. చంద్రబాబు దార్శనిక నాయకత్వం, సుపరిపాలన పట్ల నిబద్ధతతో రాష్ట్రం సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని యనమల ఈ లేఖలో ఆకాంక్షించారు.  గత ప్రభుత్వం చేసిన ఆర్థిక నష్టాన్ని పూడ్చేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు బాగున్నాయని కితాబునిచ్చారు.  


వైసీపీ ప్రభుత్వంలో అవినీతిపై త్వరలో కేసులు                                                


వైసీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని..  ఇప్పటికే టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మద్యం దగ్గర నుంచి ఇసుక, గనుల వరకూ ప్రతీ విషయంలోనూ దోపడీ జరిగిందని అంటున్నారు. ఈ లెక్కలు తీసేందుకు ఇప్పటికే అంతర్గతంగా కసరత్తు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత దోపిడికి పాల్పడిన వారిని గుర్తించి కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో  వైసీీ నేతలు దోచిన ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న చట్టం చేయాలని యనమల సూచించడం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు.