Yanamala accuses Jagan conspiring from Bangalore Palace:   వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్‌లో మకాం వేయడంపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీలో కుట్రలను అమలు చేసేందుకు జగన్ బెంగళూరులో ఒక బ్యాక్ ఆఫీస్ ను ఏర్పాటు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. బెంగళూరు అనేది జగన్ జన్మస్థలం కాదు, కనీసం ఆయన నియోజకవర్గం కూడా కాదని.. పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్న హైదరాబాద్‌ను వదిలి యలహంక ప్యాలెస్‌లోనే ఎందుకు ఉంటున్నారని యనమల ప్రశ్నించారు. త న అవినీతి సంపదను దాచుకోవడానికి, చీకటి ఒప్పందాలకు ఆ ప్యాలెస్‌ను కేంద్రంగా మార్చుకున్నారని ఆయన విమర్శించారు.         

Continues below advertisement

బెంగళూరు కేంద్రంగా ఏపీలో అశాంతి రేేపేందుకు జగన్ కుట్రలు                              

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా జగన్ బెంగళూరు కేంద్రంగానే అనేక కుట్రలకు తెరలేపారని యనమల ఆరోపించారు. నాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన అవినీతి కార్యకలాపాల వల్లే జగన్ ఆస్తులు అమాంతం పెరిగిపోయాయని పేర్కొన్నారు. జగతి పబ్లికేషన్స్, భారతీ సిమెంట్స్ వంటి సంస్థలు జగన్ అవినీతి పుత్రికలేనని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, బడుగు బలహీన వర్గాలను అణగదొక్కుతూ జగన్ తన ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని మండిపడ్డారు.                          

Continues below advertisement

వరల్డ్ సూపర్ రిచ్ క్లబ్ లో చేరుతున్న వైసీపీ నేతలు                     

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తాజాగా విడుదల చేసిన నివేదికను యనమల ఈ సందర్భంగా ప్రస్తావించారు. గత ఐదేళ్ల కాలంలో జగన్ సహా పలువురు వైసీపీ కీలక నేతల ఆస్తులు ఏకంగా 600 శాతం మేర పెరగడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని ఆయన అన్నారు. కేవలం అవినీతి మార్గంలో సంపాదించడం వల్లే ఇంతటి భారీ వృద్ధి సాధ్యమైందని, వైసీపీ నేతలు సామాన్య  నియో రిచ్ క్లబ్ నుంచి ఇప్పుడు ఏకంగా  వరల్డ్ సూపర్ రిచ్ క్లబ్ 'లో చేరుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్మును దోచుకుని తమ వ్యక్తిగత ఆస్తులను పెంచుకోవడమే లక్ష్యంగా వైసీపీ పాలన సాగిందని విమర్శించారు.                

జగన్ బెంగళూరు మకాం వెనుక అసలు రహస్యాలు బయటపడాలి !                    

ప్రస్తుతం ఏపీలో అశాంతి సృష్టించేందుకు, కుట్రలు పన్నేందుకే జగన్ బెంగళూరును వేదికగా చేసుకున్నారని యనమల స్పష్టం చేశారు. ఐదేళ్ల కాలంలో పోగేసిన అవినీతి సంపదను రక్షించుకోవడానికి, రాజకీయంగా లబ్ధి పొందడానికి ఆయన పన్నాగం పన్నుతున్నారని ఆరోపించారు. జగన్ వ్యవహారశైలిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఆయన బెంగళూరు మకాం వెనుక ఉన్న అసలు రహస్యాలను ప్రజలు గమనిస్తున్నారని యనమల రామకృష్ణుడు హెచ్చరించారు.