Andhra Pradesh: ఒకప్పుడు ఎవరికైనా సమాచారం అందజేయాలన్నా, సమాచారం తెలుసుకోవాలనుకున్నా ఉత్తరాలు రాసుకునేవారు. ప్రేమలో ఉన్న యువతీ యువకులు అయితే ప్రేమ లేఖలు రాసుకునే వారు కూడా. అయితే మొబైల్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి అవన్నీ తగ్గిపోయాయి. ఒక్క మెసేజ్, ఫోన్ కాల్ తోనే అన్ని పనులు పూర్తి అవుతున్నాయి. అయితే ఆనాటి సమాచార సాధనం గురించి నేటి తరానికి తెలపాలని.. మరిచిపోయిన ఆనాటి తరానికి గుర్తు చేయాలని తలాపాశాఖ రచనా పోటీలకు శ్రీకారం చుట్టింది. డిజిటల్ ఇండియా ఫర్ న్యూ ఇండియా అనే అంశంపై లేఖలను ఆహ్వానిస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో థాయి ఆఖర్ పేరుతో పోటీలు నిర్వహించబోతుంది. భారతదేశ పౌరులు ఎవరైనా ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. ఎలాంటి వయో పరిమితి లేదు.


ముఖ్యంగా 18 ఏళ్ల లోపు వారిని ఒక కేటగిరీగా, 18ఏళ్ల పైబబడిన వారిని మరో కేటగిరీగా పరిగణిస్తారు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో వ్యాసం కూడా రాయవచ్చు. డిజిటల్ విదానంలో పాలన, మౌలిక సదుపాయాలు, అక్షరాస్యత, డిజిటల్ పేమెంట్స్ తదితర అంశాలను అందులో పొందుపరచాలి. ఏ4 సైజు పేపుర్ పై లేఖ రాసి ఎన్వలప్ కవర్ లో ఉంచి పంపించవచ్చు. లేదా ఇన్ లాండ్ లెటర్ ద్వారా కూడా పంపించవచ్చు. ఎన్వలప్ కవర్ అయితే వెయ్యి పదాలకు మించకుండా, ఇన్ లాండ్ లెటర్ లో అయితే 500 పదాలకు మించకుండా రాయాల్సి ఉంటుంది. కంప్యూటర్, ఇతర ఎలక్ర్టానిక్ సాధనాల్లో టైప్ చేసిన లేఖలను పోటీకి అనుమతించరు. చేతితో మాత్రమే లేఖ రాసి పంపాలి. 


లేఖలను పంపే వారి వయసును నిర్ధారిస్తూ.. సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. పోటీలో గెలిస్తే వారి వయసు, ఇడీ ధ్రువీకరణకు అవసరమైన పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా రాసిన ఉత్తరాలను ది చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, ఏపీ సర్కిల్, విజయవాడ - 520013 చిరునామాకు అక్టోబర్ 31వ తేదీలోగా పంపించాలి. అయితే ఇలా చేయడం వల్ల పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు పోటీ తత్త్వం అలవడుతుందని అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ సంజయ్ కుమార్ పాండా తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీలతో పాటు స్థానిక భాషల్లో కూడా వ్యాసం రాయవచ్చని.. దీని వల్ల విద్యార్థుల్లో భాషా నైపుణ్యం కూడా పెరుగుతుందని అన్నారు.