ONGC gas drilling Blowout: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసిమండలో జరిగిన గ్యాస్ బ్లో అవుట్ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. అసలు సహజ వాయువు లేదా చమురు అన్వేషణలో ఇలాంటి  బ్లో అవుట్ ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? వాటిని అదుపు చేయడం ఎంత కష్టం?

Continues below advertisement

బ్లో అవుట్ అంటే ఏమిటి? ఎందుకు జరుగుతుంది? 

భూమి లోపల చమురు లేదా గ్యాస్ నిక్షేపాలు అత్యంత భారీ పీడనం  వద్ద ఉంటాయి. డ్రిల్లింగ్ చేసినప్పుడు, ఆ పీడనాన్ని నియంత్రించడానికి ప్రత్యేకమైన  డ్రిల్లింగ్ మడ్ అనే ద్రవాన్ని బావిలోకి పంపుతారు. ఈ ద్రవం  బరువు లోపలి పీడనాన్ని అణచివేస్తుంది. అయితే, కొన్నిసార్లు భూగర్భంలో ఊహించని విధంగా పీడనం ఒక్కసారిగా పెరిగినప్పుడు లేదా డ్రిల్లింగ్ మడ్ బరువు తగ్గినప్పుడు.. లోపలి గ్యాస్, చమురు నియంత్రణ తప్పి అత్యంత వేగంతో పైకి తన్నుకొస్తాయి. దీనినే  కిక్ అంటారు. ఈ కిక్ ను నియంత్రించలేకపోతే అది బ్లో అవుట్ గా మారుతుంది.

Continues below advertisement

నియంత్రించడం చాలాకష్టం

సాధారణంగా ఇలాంటి ప్రమాదాలను ఆపడానికి బావి ముఖద్వారం వద్ద  బ్లో అవుట్ ప్రివెంటర్ అనే భారీ యంత్రాన్ని అమర్చుతారు. ఇది ఒక రకమైన సేఫ్టీ వాల్వ్ లాంటిది. లోపలి నుంచి పీడనం పెరిగినప్పుడు ఇది బావిని గట్టిగా మూసేస్తుంది. కానీ, ఇరుసుమండ వంటి ఘటనల్లో.. మరమ్మతులు చేస్తున్నప్పుడు లేదా యంత్రం పాతదైనప్పుడు ఈ బి.ఓ.పి సరిగ్గా పనిచేయకపోవచ్చు. గ్యాస్‌తో పాటు రాళ్లు, ఇసుక వంటివి రావడం వల్ల వాల్వ్‌లు దెబ్బతిని గ్యాస్ బయటకు లీక్ అవుతుంది. ఒకసారి బ్లో అవుట్ జరిగి మంటలు అంటుకున్నాక, వాటిని ఆర్పడం చాలా క్లిష్టమైన ప్రక్రియ.

మంటలు ఆర్పడం చాలా కష్టం  

బావి నుంచి గ్యాస్ నిరంతరం అత్యంత వేగంతో   బయటకు వస్తుంటుంది. నీళ్లు చల్లినా ఆ వేగానికి అవి ఆవిరైపోతాయి. మంటల వల్ల బావి చుట్టూ ఉన్న పరికరాలు, ఇనుప రిగ్గులు కరిగిపోయి ఒక ముద్దలా తయారవుతాయి. వీటిని తొలగించకుండా బావి ముఖద్వారాన్ని మూయడం అసాధ్యం.  మంటలు ఆర్పే క్రమంలో గ్యాస్ లీక్ అవుతూనే ఉంటుంది. అది మళ్ళీ పేలిపోయే అవకాశం ఉన్నందున నిపుణులు చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో డైనమిక్ కిల్లర్ అనే పద్ధతిని వాడతారు. అంటే మంటలు ఎగసిపడుతున్న బావిలోకి అత్యధిక పీడనంతో భారీ మొత్తంలో డ్రిల్లింగ్ మడ్ లేదా సిమెంట్‌ను పంపి లోపలి గ్యాస్‌ను అణచివేస్తారు. కొన్నిసార్లు ప్రమాదం జరిగిన బావికి కొద్ది దూరంలో మరో బావిని  తవ్వి, భూగర్భంలోనే ఆ గ్యాస్ ప్రవాహాన్ని మళ్లించి అసలు బావిని మూసేస్తారు. అందుకే  రోజుల నుండి వారాల సమయం పడుతుంది.

మానవ తప్పిదం వల్లనే బ్లో అవుట్ ?  

డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు బావి లోపల పీడనంలో వచ్చే చిన్న మార్పులను కూడా గుర్తించే సెన్సార్లను నిరంతరం గమనిస్తూ ఉండాలి. బ్లో అవుట్ ప్రివెంటర్ (BOP) యంత్రాలను కాలానుగుణంగా పరీక్షించాలి,  నాణ్యమైన పరికరాలనే వాడాలి. డ్రిల్లింగ్ మడ్   సాంద్రతను ఎప్పటికప్పుడు లెక్కిస్తూ, భూగర్భ పీడనాన్ని తట్టుకునేలా జాగ్రత్త పడాలి. ఇలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు సెకన్ల వ్యవధిలో ఎలా స్పందించాలో సిబ్బందికి అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇవ్వాలి. కానీ ఇసురుమండ బ్లోఅవుట్ సమయంలో మానవ తప్పిదం  జరిగినట్లుగా భావిస్తున్నారు.