Nagababu As Minister: నాగబాబుకి మంత్రి పదవి ప్రకటించి ఏడాది.. కానీ, పవన్ కళ్యాణే వెనకాడుతున్నారా ?
AP minister Nagababu | నాగబాబు కి మంత్రి పదవి ప్రకటించి ఏడాది పూర్తయినా పదవి ఇవ్వలేదు. ఏడాది కావడంతో అసలేం జరుగుతుందా అని జనసేన నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

AP Politics | అమరావతి: మెగా బ్రదర్ నాగబాబుకి మంత్రి పదవి ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించి ఏడాది అయింది. పోయిన సంవత్సరం సరిగ్గా ఇదే రోజున అంటే 09.12.2024 న ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో పార్టీ అధికారిక లెటర్ హెడ్ ఫై ఈ ప్రకటన చేశారు. అప్పటికి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకటి టీడీపీ, ఒకటి జనసేన, మరొకటి బీజేపీ తీసుకుంటాయని ప్రచారం జరిగింది. వాటిలో టీడీపీ నుండి బీద మస్తాన్ రావు, బీజేపీ నుండి R. కృష్ణయ్య, జనసేన నుండి కొణిదెల నాగబాబు అని అందరూ ఫిక్స్ అయ్యారు.
అనూహ్యంగా టీడీపీ నుండి మరోపేరు సాన సతీష్ పేరు సీన్ లోకి రావడం తో టీడీపీ రెండు ఎంపీ స్థానాలు తీసుకొంది. సాన సతీష్ రాజ్యసభ సీటు వెనుకాల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఆశీస్సులు ఉన్నాయన్న ప్రచారం గుప్పుమంది. జగన్ హయాంలో చంద్రబాబు జైలు కి వెళ్ళినప్పుడు ఢిల్లీ వ్యవహారాల్లో లోకేష్ కి అండగా సాన సతీష్ ఉన్నారని అందుకే ఆయనకీ ఆ పదవి దక్కింది అని టీడీపీ లో చాలామంది గుసగుసలాడారు. ఇక నాగబాబు కి రాజ్యసభ సీటు ఖాళీ లేకపోవడం తో ఆయనను మంత్రిమండలి లోనికి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా లిఖిత పూర్వకం గా ప్రకటించారు. అయితే అది ఇప్పటికీ ఆచరణ లోనికి మాత్రం రాలేదు.
జనసేన లో 'త్యాగరాజు'లా మిగిలిపోతున్న నాగబాబు
2019-24 మధ్యలో జనసేన లో నాగబాబు కీలక పాత్ర పోషించారు. 2019 ఎన్నికల్లో నరసాపురం నుండి ఎంపీ గా పోటీ చేసి అప్పటి వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘు రామ కృష్ణం రాజు చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ నిరాశ చెందకుండా 2024 వరకూ పార్టీ తరపున కీలకం గా ఉంటూ వచ్చారు. 2024, ఎన్నికల్లో నరసాపురం నుండి పోటీ చేద్దాం అనుకుంటే అది కూటమి కోసం త్యాగం చెయ్యాల్సి వచ్చింది. అనకాపల్లి నుండి పోటీ అనుకున్నా చివరి క్షణం లో అది బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ కోసం వదిలిపెట్టాల్సి వచ్చింది. మధ్యలో ఎమ్మెల్యే గా పోటీ చేద్దాం అనుకున్నా అదికూడా కుదరలేదు. దానితో రాజ్యసభ కు పంపుదామని పవన్ భావించారు. కానీ అదికూడా సాన సతీష్ కోసం వదలాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వరుసగా నాగబాబుకి హ్యాండ్ ఇస్తూ ఉండడం ఫై అభిమానుల్లో ఏర్పడ్డ అసంతృప్తి ని చల్లార్చడానికి ఎన్నదూ లేని విధంగా రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన లో భాగం గానే నాగబాబు కి మంత్రి పదవి అంటూ చంద్రబాబు నాయడు స్పష్టత ఇచ్చారు. కానీ ఏడాది దాటినా అది ప్రకటన లానే ఉండిపోయింది. అయితే ఆయన్ను ఎమ్మెల్సీ ని చేసి శాసన మండలి కి పంపారు.
పవన్ కళ్యాణే వెనకాడుతున్నారా?
ఏపీ క్యాబినెట్ లో ప్రస్తుతం ఒక్క ఖాళీనే ఉంది. దానిని నాగబాబు తో భర్తీ చెయ్యాలని చంద్రబాబు అనుకున్నా చివరి నిముషం లో జన సేనాని పవన్ కళ్యాణ్ పునరాలోచన లో పడ్డారని జనసేన వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే జనసేన నుండి పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ మంత్రులు గా ఉన్నారు. వీరిలో పవన్, దుర్గేష్ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. ఇప్పుడు నాగబాబు కి మంత్రి పదవి అంటే ఉన్న నాలుగు మంత్రి పదవుల్లో మూడు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చినట్టు అవుతుంది. దానివల్ల జనసేన కు పూర్తిగా కులముద్ర పడిపోయే అవకాశం ఉంటుందని ప్రత్యర్థులకు ఆ అవకాశం ఇవ్వడం ఎందుకు అనేది పవన్ కళ్యాణ్ ఆలోచన గా చెబుతుంటారు ఎనలిస్ట్ లు.
ఒకానొక సందర్బంలో పవన్ కూడా ఇండైరెక్ట్ గా ఇదే మాట చెప్పే ప్రయత్నం కూడా చేశారు. దానితో నాగబాబుకు మంత్రి పదవి అనేది రియాలిటీ కి దూరంగా ఉండిపోయింది. మరి త్వరలో జరుగబోతోందిఅని ప్రచారం లో ఉన్న మంత్రి మండలి పునర్వవస్థీకరణ లో అన్నా నాగబాబు కి మంత్రి పదవి లభిస్తుందా లేదా అన్నది ఏపీ పాలిటిక్స్ లో ఆసక్తి కర చర్చ లా మారింది.






















