Light Rain Likely at Isolated Places Over Andhra Pradesh: ఏపీ ప్రజలకు ఎండల నుంచి మరో రెండు రోజులపాటు ఊరట కలగనుంది. దక్షిణ బంగాళాఖాతం నుంచి 45 - 55  కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై భారత వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజులు ఏపీలో వర్షాలు కురవనున్నాయని పేర్కొన్నారు. దక్షిణ బంగాళాఖాతంలో మార్పుల ప్రభావంతో ప్రస్తుతం మధ్య ట్రోపో ఆవరణంలో బలమైన గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఏపీ, యానాంలో మరో రెండు నుంచి మూడు రోజులు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు నిలకడగా ఉన్నాయి.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో.. (Temperature in Andhra Pradesh)
ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, యానాంలకు నేడు సైతం వర్ష సూచన ఉంది. మరో రెండు నుంచి మూడు రోజులపాటు ఈ ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.. దక్షిణ బంగాళాఖాత నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నేడు కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్ని చోట్ల  తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. రైతులు ధాన్యం ఆరుబయట నిల్వ ఉంచకూడదని అధికారులు సూచించారు. తీరంలో బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ ప్రాంతాల్లో అత్యధికంగా నందిగామలో 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, గన్నవరంలో 38.2, అమరావతిలో 37.5, జంగమేశ్వరపురంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నాయి.


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
రాయలసీమలో, దక్షిణ కోస్తాంధ్రలో ఉక్కపోత, వేడి మరింత పెరగనుంది. ఈ రోజు రాయలసీమ జిల్లాలతో పాటుగా దక్షిణ కోస్తాంధ్రలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 37 నుంచి 39 డిగ్రీల దాక నమోదు కానున్నాయి. రాయలసీమకు ఎలాంటి వర్ష సూచన లేదని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సీమలో ఉష్ణోగ్రతలు మళ్లీ భారీగా నమోదు కానున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మధ్యాహ్నం వేళ అత్యవసరమైనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని సూచించారు. ఇక్కడ అత్యధికంగా అనంతపురం, నంద్యాలలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలులో  38.6, కడపలో 37.2 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలతో ఉక్కపోత కాస్త పెరిగింది.






తెలంగాణ వెదర్ అప్‌డేట్స్.. (Temperature in Telangana)
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మేర నమోదవుతున్నాయి. హైదరాబాద్ వాసులకు మాత్రం ఎండల నుంచి ఏమాత్రం ఊరట లభించడం లేదు. వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు రెండు రోజుల్లో ఊరట కలగనుంది. ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కొన్ని జిల్లాల్లో ఓమోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, మెదక్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.


Also Read: Gold-Silver Price: బంగారం కొంటున్నారా? భారీ షాక్! ఒక్కసారిగా ఎగబాకిపోయిన ధర - వెండి కూడా


Also Read: Horoscope Today 13 th April 2022: ఈ రోజు ఈ రాశివారు నచ్చని వ్యక్తులను కలుస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి