శ్రీలంకకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి విస్తరించిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, తూర్పు గాలుల ప్రభావంతో కోస్తాలో మేఘాలు ఆవరించడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వరి కోతలు కోసే రైతులు అప్రమత్తం కావాలని వ్యవసాయ శాఖ సూచించింది. బుధవారం రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.

అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఒకట్రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఉరుములు, మెరుపులు ఒకట్రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఒకట్రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

తెలంగాణలో ఇలా..తెలంగాణలో వాతావరణ పరిస్థితుల అంచనాలను హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రాగల 5 రోజులు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం లేదని వెల్లడించింది. వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేసింది. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని అంచనా వేసింది. నిన్న నల్గొండలో 33.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని, జీహెచ్ఎంసీ పరిధిలో 31.2 డిగ్రీల ఉష్ణోగ్రత బేగంపేట్‌లో నమోదయిందని ఐఎండీ పేర్కొంది.