బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. తాజాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం అక్టోబరు 29 నాటికి శ్రీలంక, తమిళనాడు మధ్యన ఏర్పడుతుందని, దీని ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తాంధ్రపై ఉంటుందని వాతావరణ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు. దాని ప్రభావంతో ఈ నెలాఖరులో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అదే సమయంలో 29 నుంచి ఈశాన్య రుతుపవనాలు భారతదేశంలోకి వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ విడుదల చేసిన వెదర్ బులెటిన్ తెలిపింది. సాధారణంగా, నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ 17న దేశంలోని వాయువ్య ప్రాంతాల నుండి ఉపసంహరించుకోవడం ప్రారంభమవుతాయి. అక్టోబర్ 15 నాటికి దేశం నుండి పూర్తిగా తొలగిపోతాయి.
“పై పరిస్థితులలో, తమిళనాడు, పుదుచ్చేరి మరియు కారైకాల్‌లో అక్టోబర్ 29 మరియు 30 తేదీలలో మరియు కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మరియు యానాంలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 30న రాయలసీమ, కేరళలలో, అక్టోబర్ 30న తమిళనాడు, పుదుచ్చేరి మరియు కారైకాల్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో ఈశాన్య రాష్ట్రాలు మరియు ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా భవిష్యత్తులో కోస్తాంధ్రలో 338.1 మిల్లీమీటర్లు, రాయలసీమలో 223.3 మిల్లీ మీటర్ల సాధారణ సరాసరి వర్షపాతం నమోదవుతుంది. నైరుతి రుతుపవనాల సీజన్‌లో కంటే ఈశాన్య రుతుపవనాల సమయంలోనే బంగాళాఖాతంలో తుపానులు ఎక్కువగా ఏర్పడతాయని అంచనా వేశారు. వాటిలో అధికంగా దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడులపైనే ప్రభావం ఉండనుంది. సాధారణంగా ఈశాన్య రుతుపవనాల సీజను అక్టోబర్ - డిసెంబర్‌ల మధ్యలో కనీసం మూడు తుపానులు ఏర్పడుతుంటాయి. కానీ ఈ ఏడాది అంతకు మించి పరిస్థితులు ఏర్పడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
పెరుగుతున్న చలి
ఏపీలోని పలు ప్రాంతాల్లో చలి వాతావరణం నెలకొంది. ఇక అరకు, లంబసింగి వంటి ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు దాదాపు 15 డిగ్రీలకు పడిపోయాయి. ఇటు తెలంగాణలోనూ చలి తీవ్రత పెరిగింది. ఉత్తరాది నుంచి వీస్తున్న గాలులు, మేఘాలు లేకపోవడం కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని వాతావరణ అధికారులు తెలిపారు. వాతావరణంలో తేమ కూడా తక్కువగా ఉంటుంది. తూర్పు కోస్తా నుంచి వీస్తున్న గాలుల తీవ్రత రెండు మూడు రోజుల్లో పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. కాబట్టి, మూడు నాలుగు రోజుల్లో, ఉష్ణోగ్రతలో వ్యత్యాసం కనిపిస్తుందని తెలిపారు.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలో గత మూడు, నాలుగు రోజుల నుంచి వర్షాలు అసలు లేవు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఉదయం పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాత్రి వేళ చలి తీవ్రత సైతం అధికం అవుతోంది. హైదరాబాద్ లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 31 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా నమోదైంది. వాయువ్య దిశ నుంచి గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వచ్చే 3 రోజులు తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.