ఆంధ్రప్రదేశ్‌, యానాంలలో దిగువ ట్రోపోస్పిరిక్‌ స్థాయుల్లో తూర్పు, ఈశాన్య దిశలో గాలులు వీస్తున్నాయని వాతావరణ అధికారులు చెప్పారు. దీనివల్ల నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా పశ్చిమ నైరుతి దిశగా గంటకు 13 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ట్రింకోమలీ (శ్రీలంక) కి తూర్పు ఈశాన్యంగా 400 కిలో మీటర్ల దూరంలో, నాగపట్టినంకు తూర్పుగా 470 కిలో మీటర్లు (తమిళనాడు), చెన్నై (తమిళనాడు)కి తూర్పు ఆగేయంగా 500 కిలో మీటర్లకు సమీపంలో కేంద్రీకృతం అవుతోంది. 


ఆ తర్వాత పశ్చిమ నైరుతి దిశగా కదిలి 25న ఉదయం శ్రీలంక తీరానికి చేరుకుంటుంది. తర్వాత శ్రీలంక మీదుగా పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ ఆదివారం (డిసెంబర్‌26) ఉదయం నాటికి కొమోరిన్‌ ప్రాంత పరిసర ప్రాంతాలకు చేరుకుంటుంది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలతోపాటు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌, యానాంలో ఆదివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. సోమవారం ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.


దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో ఆదివారం, సోమవారం ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.


రాయలసీమ ప్రాంతంలో ఆదివారం, సోమవారం ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.


‘‘మొత్తానికి వర్షాలు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ప్రారంభం అవ్వనున్నాయి. నిన్న చెన్నైలో కురిసిన వర్షాలు ఇప్పుడు నేరుగా మన ఆంధ్రా వైపుగా వస్తున్నాయి. దీని వలన మరో మూడు గంటల వరకు దక్షిణ జిల్లాలలైన తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు అక్కడక్కడ పడనుంది, అలాగే ఒకటి లేదా రెండు చోట్లల్లో మోస్తరు వర్షాలుంటాయి. ఇంక తెల్లవారి అయ్యేసరికి కొంచెం విస్తారంగా పడతాయి. దీని నుంచి భారీ వర్షాలుంటాయి అని అనుకోకండి.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.


తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ‘‘హైదరాబాద్ లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 16 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు ట్వీట్ చేశారు.