Asani Cyclone Effect Latest News: అసని తుపాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా తీరం దాటేసింది. దీనికి సంబంధించి ఐఎండీ బుధవారం రాత్రి ప్రకటన చేసింది. తుపాన్ కాస్త బలహీనపడి తీవ్ర వాయుగుండంగా బుధవారం సాయంత్రం తీరం దాటింది. కృష్ణా జిల్లా కృత్తివెన్ను వద్ద (మచిలీపట్నం - నరసాపురం మధ్య) తీరం దాటిందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ తీవ్ర వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 55 నుంచి గరిష్ఠంగా 75 కిలో మీటర్ల వేగంతో తీవ్రమైన గాలులు వీచాయి. గురు, శుక్రవారాల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. తీరం దాటిన అసని తీవ్ర వాయుగుండం ఉత్తర ఈశాన్యంగా యానాం, కాకినాడ, తుని వరకు తీరం వెంబడి పయనిస్తూ మళ్లీ సముద్రంలో కలిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
దీని ఫలితంగా వచ్చే మూడు రోజుల వరకూ వాతావరణ అంచనాలను వాతావరణ అధికారులు ప్రకటించారు. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. భారీ, నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. బలమైన ఈదురుగాలులు గంటకు 70 నుంచి 80 కిలో మీటర్ల వేగంతో, గరిష్ఠంగా 90 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.
రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉరుములు, జల్లులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు మాత్రం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. తుపాను నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ 24 గంటలూ అందుబాటులో ఉండేలా హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అత్యవసర సహాయం కోసం 1070, 1800 425 101 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Telangana Weather తెలంగాణలో వాతావరణం ఇలా
అసని తుపాను ఎఫెక్ట్ తెలంగాణపై అంతగా లేదు. హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో నేడు స్వల్పంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు పసుపు రంగు అలర్ట్ జారీ చేశారు.