AP Voter List | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. వివరాలు నింపిన ఎన్యూమరేషన్‌ పత్రాలను బూత్ స్థాయి అధికారులకు BLOs సమర్పించడానికి నేడు (మంగళవారం) చివరిరోజు. గడువు ముగుస్తున్న క్రమంలో ఎన్యూమరేషన్‌ పత్రాల స్వీకరణ, డిజిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి మరో 10 రోజుల పాటు గడువు పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) వివేక్‌ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పలు నియోజకవర్గాల్లో ఇంకా 5 నుండి 10 శాతం మేర డిజిటైజేషన్ పెండింగ్‌లో ఉందన్నారు. వివిధ రాజకీయ పక్షాలు, జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన వినతులను ఈ లేఖతో పాటు పంపించారు. కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై స్పందించాల్సి ఉంది. 

Continues below advertisement

39.81 లక్షల అన్‌ కలెక్టబుల్‌ పత్రాలు

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 39.81 లక్షల మంది ఓటర్ల ఎన్యూమరేషన్‌ పత్రాలు సేకరించడానికి వీలుపడకుండా అన్‌ కలెక్టబుల్‌ గా మిగిలిపోయినట్లు ఈసీ తెలిపింది. సుమారు 14.19 లక్షల పత్రాలు చనిపోయిన వారివి కాగా, మరో 12.14 లక్షల పత్రాలు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారివి. బీఎల్‌వోలు ఎంత ప్రయత్నించినా అందుబాటులో లేని, ఫోన్లకు స్పందించని ఓటర్ల పత్రాలు 7.26 లక్షల వరకు ఉన్నాయని అధికారులు తెలిపారు.

Continues below advertisement

 నియోజకవర్గాల వారీగా చూస్తే తిరుపతి, కడప, గుంటూరు పశ్చిమ, కర్నూలు ప్రాంతాల్లో ఇలాంటి సేకరించలేని పత్రాల సంఖ్య ఎక్కువగా ఉండగా.. నర్సాపురం, భీమవరం, ఆచంట వంటి నియోజకవర్గాల్లో చాలా తక్కువగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 4.16 కోట్ల మంది ఓటర్లలో 98.32 శాతం మంది పత్రాలను ఎన్నికల సంఘం విజయవంతంగా డిజిటైజ్ చేసింది. ఓటర్లు తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి ఎన్యూమరేషన్‌ పత్రాలను బీఎల్‌వోలకు వెంటనే సమర్పించాలని అధికారులు సూచించారు. లేకపోతే జులై 21న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో పేరు ఉండదని, తద్వారా ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. 

Also Read: Yarlagadda Venkatrao: ప్రత్యర్థులకు ప్రభుత్వం కాంట్రాక్టులు, టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి: ఎమ్మెల్యే యార్లగడ్డ

ఇప్పటికే పత్రాలను సమర్పించిన వారు, తమ వివరాలు పోర్టల్‌లో డిజిటైజ్ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి ఈసీఐ నెట్ (ECI Net) యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్ (https://voters.eci.gov.in) ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఓటరు గుర్తింపు కార్డు నంబరును నమోదు చేయడం ద్వారా ఈ వివరాలను సులభంగా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు అని తెలిపారు..

షెడ్యూల్, కీలక మైలురాళ్లు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నిబంధనల ప్రకారం, ఈ ఓటర్ల సవరణ ప్రక్రియ నిర్దిష్ట కాలపరిమితితో జరుగుతుంది. 

జులై 21: ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన.  రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ రోజున తాజా జాబితాను ప్రదర్శిస్తారు.

జులై 21 నుండి ఆగస్టు చివరి వారం వరకు: అభ్యంతరాలు, క్లెయిమ్‌లు స్వీకరిస్తారు. జాబితాలో పేర్లు లేని వారు కొత్తగా నమోదు చేసుకోవడానికి (ఫారమ్-6), తప్పుల సవరణకు (ఫారమ్-8) ఈ సమయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

సెప్టెంబర్- అక్టోబర్: అందిన దరఖాస్తులు పరిశీలించి, క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్.

జనవరి (వచ్చే ఏడాది): తుది ఓటర్ల జాబితా విడుదల.

'అన్ కలెక్టబుల్' ఓటర్లపై తదుపరి చర్యలుబీఎల్‌వోలు (BLO) సేకరించలేకపోయిన అన్ కలెక్టబుల్ 39.81 లక్షల ఓటర్ల వివరాలపై తప్పుడు తొలగింపులు జరగకుండా ఎన్నికల సంఘం కఠినమైన మార్గదర్శకాలనుఅనుసరిస్తుంది. కేవలం బీఎల్‌వోకు వివరాలు దొరకలేదనే కారణంతో ఓటును జాబితా నుండి తొలగించరు. చిరునామా మారినట్లు లేదా ఓటరు అందుబాటులో లేనట్లు అనుమానం ఉన్న పేర్లకు మొదట 7 నుండి 15 రోజుల ముందస్తు నోటీసు జారీ చేస్తారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ స్థాయి ప్రతినిధులు (BLA) కూడా ఈ 'అన్ కలెక్టబుల్' జాబితాను పరిశీలించి, వారు నిజంగానే ఆ ప్రాంతంలో లేరని ధ్రువీకరించాల్సి ఉంటుంది.