ఇండియన్  నేవీ లో మహిళా అగ్నివీరులను నియమిస్తున్నట్టు నౌకాదళం ప్రకటించింది. నేవీ డే సందర్బంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా  ఈ  విషయం తెలిపారు. ఇప్పటీకే  ఈ ప్రక్రియ మొదలైనట్టు ఆయన తెలిపారు.  ఇండియన్ నేవీ లో 3000 మంది వరకూ అగ్నివీర్ లను నియమించే అవకాశం ఉందని వీరిలో 324 మంది మహిళలు ఉంటారని ఆయన అన్నారు. ఇకపై జరిగే నియామకాల్లో 20 శాతం మంది మహిళలను ఎంపిక చేసేలా చూస్తామన్నారు . 




(INS Arihant)


విశాఖకు మరో అణు సబ్ మెరైన్


 విశాఖ తీరంలో మరో అణు జలాంతర్గామిని మోసరించనున్నట్టు తూర్పు నౌకాదళం ప్రకటించింది . ఇప్పటికే INS అరిహంత్ వైజాగ్ తీరం కేంద్రంగా విధులు నిర్వర్తిస్తుండగా దానికి తోడుగా మరో క్రొత్త న్యూక్లియర్ సబ్ మెరైన్ ను రెడీ చేస్తున్నట్టు నేవీ తెలిపింది .



యుద్ధ నౌకల్లోనూ  మహిళా నావికుల విధులు


 భారత యుద్ధ నౌకల్లోనూ మహిళా అధికారుల ,నావికుల విధులను ఉపయోగించుకునేలా అధ్యయనం జరుగుతుందని .. దీనిపై త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటామని బిశ్వజిత్ తెలిపారు . ఇప్పటికే ఇండియన్ నేవీ లోని ఈస్టర్న్ కమాండ్ లో  6శాతం మంది  మహిళలు పనిచేస్తున్నారని .. వీరు ఆఫిసర్ కేడర్ లో ఉన్నారని ఆయన అన్నారు . 


శ్రీలంక తీరంలో చైనా కదలికలను గమనిస్తున్నాం 


 ఇటీవల శ్రీలంక తీరంలో చైనా నిర్మించిన పోర్ట్ తో ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రాబ్లం  లేదనీ అయితే ఇండియన్ నేవీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నట్టు వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ తెలిపారు . కేవలం చైనా అనే కాకుండా సరిహద్దు జలాల్లో వివిధ దేశాల కార్యకలాపాలపై ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతామని ఆయన అన్నారు .



రాంబిల్లిలో మరో నేవెల్ బేస్  


విశాఖ తీరంలోని రాంబిల్లి వద్ద మరో నేవెల్ బేస్ ను 2024 కల్లా అభివృద్ధి చేస్తున్నామని అన్న బిశ్వజిత్ ప్రస్తుతం విశాఖ లో ఉన్న INS డేగ నేవెల్ బేస్ ను మరింత అభివృద్ధి చేస్తామని .. మిగ్ -29 సహా ఇండియన్ నేవీ కి చెందిన ఇతర విమానాల అవసరాలకు తగినట్టుగా INS డేగా ను మరింత అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు.


అగ్నివీర్(ఎంఆర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్


కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన అగ్రిపథ్ స్కీమ్‌లో భాగంగా.. ఇండియన్ నేవీలో అగ్నివీర్(ఎంఆర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతి ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిసెంబర్ 8 నుంచి 17 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అగ్నివీర్‌గా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్ఎస్ చిల్కాలో ప్రారంభమయ్యే 01/2023 (మే 23) బ్యాచ్ పేరుతో శిక్షణ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.35500, నాలుగో ఏడాది రూ.40 వేల వేతనం లభిస్తుంది.