YS Jagan Mohan Reddy |  శనివారం నాటి పరిణామాలు  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. జగన్మోహన్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడు నమ్మకమైన వ్యక్తి, ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy) లిక్కర్ స్కామ్ లో అరెస్గ్ కావడం వైసీపీ పార్టీ కి పెద్ద కుదుపు అనే చెప్పాలి. పార్టీ కీలక నేతలందరూ  మిథున్ రెడ్డి అరెస్ట్ ను ఖండిస్తున్నారు.  ఇదంతా పెద్ద కుట్ర అంటూ విరుచుకు పడుతున్నారు 

వైసీపీ ఊహించని పరిణామం 

గత వైసీపీ హయాంలో జరిగింది అని ప్రచారం లో ఉన్న మద్యం  కుంభకోణం లో ఇప్పటికే చాలామంది అరెస్టు అయ్యారు. పార్టీ నుంచి బయటికి వచ్చిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం లిక్కర్ స్కామ్ లో చాలామంది పెద్దల పాత్ర ఉందంటూ  అప్పట్లో సంచలనం సృష్టించారు.  టిడిపిలో చాలామంది మిథున్ రెడ్డి పేరు తెరమీదకు తెచ్చినా చాలాకాలంగా ఆయనపై ఎటువంటి చర్యలు లేకపోవడంతో విషయం నెమ్మదిగా చప్పబడిపోతోంది అంటూ  విశ్లేషణలు వినిపిస్తూ వచ్చాయి.  కేంద్రంలో బాగా పలుకుబడి ఉన్న మిథున్ రెడ్డి  అక్కడి పెద్దలతో మాట్లాడారని అందుకే  లిక్కర్ స్కామ్ లో సిట్ విచారణ  నత్తనడకన సాగుతుందన్న  విమర్శలు వినిపించాయి. అయితే వాటన్నిటికీ చెక్ పెడుతూ  ఈరోజు మిథున్ రెడ్డి  సిట్ విచారణకు హాజరు కావడం  గంటల తరబడి జరిగిన విచారణ తర్వాత ఆయనను అరెస్ట్ చేయడం  ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

YS  జగన్ కు అత్యంత సన్నిహితుడు మిథున్ రెడ్డి 

మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత YS జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకమైన వ్యక్తుల్లో పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ఉంటారు.ఇతర విషయాల్లో    సజ్జల రామకృష్ణారెడ్డి తదితరుల సలహాలు తీసుకున్నా  పెద్దిరెడ్డి కుటుంబం ఉన్న ప్రాంతాల్లో వారిదే పై చేయి అనీ వారికి పూర్తి ఫ్రీడం జగన్ ఇచ్చేసారని  చిత్తూరు జిల్లాలో నమ్ముతుంటారు. దానికి తగ్గట్టే చిత్తూరు ప్రాంతంలో పెద్దిరెడ్డి, ఢిల్లీ రాజకీయాల్లో  ఆయన కుమారుడు మిథున్ రెడ్డి  ప్రస్తుతం వైసీపీ వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటారు.  అలాంటిది ప్రస్తుతం మిథున్ రెడ్డి  లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ కావడం అనేది జగన్ కు వ్యక్తిగతంగా పెద్ద దెబ్బనే చెప్పాలి. ఇంతకుముందు రకరకాల కేసుల్లో  అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి లాంటి ప్రముఖుల ఉదంతాలను మిథున్ రెడ్డి అరెస్ట్ తో పోల్చలేము.

మిథున్ రెడ్డి కుటుంబం డైరెక్ట్ గా  జగన్మోహన్ రెడ్డి నే ప్రభావితం చేసేంత పవర్ ఫుల్ అని వైసీపీ లోనే టాక్ ఉంది. అలాంటిది ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్టు  జగన్ను టార్గెట్ చేయడంలో భాగమని వైసిపి ఆరోపిస్తుంది. మాజీ మంత్రి వైసిపి నాయకుడు  అనిల్ కుమార్ యాదవ్ ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై  జగన్ మోహన్ రెడ్డి తదుపరి స్టెప్ ఎలా ఉంటుందో అన్న ఆశక్తి ఏపీ రాజకీయాల్లో మొదలైంది 

తాజాగా లిక్కర్ స్కామ్ లో మరో 8 మంది పేర్లు 

ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో చాలామంది ని విచారించిన సిట్ తాజాగా మరో 8మంది పేర్లను లిస్ట్ లో చేర్చింది. వారికి కూడా లిక్కర్ కుంభకోణం తో సంబంధం ఉందని  అధికారులు పేర్కొన్నారు. ఇక ఇప్పటికే ఈ కేసులో విచారణ కు హాజరైన విజయసాయి రెడ్డి అప్రూవర్ గా మారతారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదేగనుక జరిగితే జగన్ మోహన్ రెడ్డి కి మరిన్ని చిక్కులు పెరిగినట్టే అంటున్నారు లీగల్ ఎక్స్ పర్ట్స్.