Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం
వైాజాగ్ స్టీల్ ప్లాంటులో జరిగింది ఒక్క ప్రమాదం కాదని, అరగంట వ్యవధిలో రెండు ప్రమాదాలు జరిగాయి. మృత్యుంజయులం అని పోస్ట్ పెట్టిన కాసేపటికే తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో సోమవారం చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదానికి సంబంధించి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ జరిగింది ఒక ప్రమాదం కాదు.. అరగంట వ్యవధిలో ఒకే రకమైన రెండు ప్రమాదాలు జరిగాయి. స్టీల్ మెల్ట్ షాప్ (SMS-1) లో భారీ పేలుడు జరిగి 8 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. అంతకు ముందే ఎస్‌ఎంఎస్-2 లోనూ సరిగ్గా అలాంటి పేలుడు ఘటన సంభవించింది. అదృష్టవశాత్తూ ఎవరికి ఏం కాలేదు. కానీ అంతలోనే ఎస్ఎంఎస్1లో పేలుడుతో విస్ఫోటనం జరిగి ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎస్‌ఎంఎస్-1, ఎస్‌ఎంఎస్-2లలో ఒకేసారి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అని కార్మికులు, సిబ్బంది తెలిపారు.

సోమవారం సాయంత్రం దాదాపు 3:57 గంటల సమయంలో ఎస్‌ఎంఎస్-2 విభాగంలో కన్వర్టర్ నుంచి సెకండరీ మెటలర్జీకి లాడిల్ (ఉక్కు ద్రవపు పాత్ర) వచ్చే క్రమంలో క్రేన్‌తో పైకి ఎత్తుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 60 టన్నుల మరుగుతున్న ఉక్కు ద్రవం కింద పోయింది. అక్కడ పనిచేస్తున్న నలుగురు పర్మినెంట్ ఉద్యోగులు, ఇద్దరు ఇన్‌ఛార్జ్‌లు, దాదాపు 10 మంది కలాసీలు కలిపి మొత్తం 16 మంది కార్మికులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఏం జరిగిందా అని తోటి ఉద్యోగులు టెన్షన్ పడుతున్న సమయంలో తాము మృత్యుంజయులం అంటూ వారు సహోద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లో పెట్టిన మెసేజ్‌లు చూసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం తప్పిపోయిందని సంతోషించారు. కానీ, ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.
అరగంటలోనే మరో విభాగంలో పేలుడు.. 8 మంది దుర్మరణం
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఎస్‌ఎంఎస్-2 ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే, అంటే సాయంత్రం దాదాపు 4:25 గంటల ప్రాంతంలో ఎస్‌ఎంఎస్-1 విభాగంలో కంటిన్యూ క్యాస్టింగ్ డిపార్ట్‌మెంట్ నుండి మిషన్-2కు ఉక్కు ద్రవాన్ని పంపుతుండగా మరో భారీ పేలుడు సంభవించింది. దాదాపు 1500 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ఉక్కు ద్రవం మీద పడటం, వేడి ఎక్కవగా ఉండటంతో ఎనిమిది మంది కార్మికులు మరణించారు. ద్రవపు ఉక్కు నుంచి గ్యాస్‌ను పూర్తిగా తొలగించకుండా పంపడం వల్లే లాడిల్‌లో ప్రెజర్ పెరిగి పేలిపోయి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

భద్రతా నిబంధనలపై 6 నెలల ముందే ఫిర్యాదులు
విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కనీస భద్రతా ప్రమాణాలను పాటించడం లేదని, అందువల్లే ఈ తరహా ప్రమాదాలు పునరావృతమవుతున్నాయని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతేడాది డిసెంబరు 9న ఏఐటీయూసీ (AITUC) యూనియన్ కేంద్ర రీజియన్ ప్రతినిధులు లేబర్ కమిషనర్‌కు లేఖ రాశారు. 2024 జనవరి నుంచి ఇప్పటివరకు స్టీల్ ప్లాంట్‌లో జరిగిన పలు ప్రమాదాల వల్ల 20 మందికి పైగా చనిపోగా, వందల మంది గాయపడ్డారని ఆ లేఖలో పేర్కొన్నారు. గత మార్చిలో డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌కు కూడా ఫిర్యాదు చేసినా కార్మికులు సురక్షితంగా ఉండేలా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

యాజమాన్యం ఒత్తిడి, నాసిరకం మెటీరియలే కారణమా?
ఈ ప్రమాదాల వెనుక యాజమాన్యం నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాల ఒత్తిడి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మికులకు తగిన సమయం ఇవ్వకుండా ఒత్తిడి పెంచడం, భద్రతా ప్రొటోకాల్స్ సరిగ్గా అమలు చేయకపోవడం ప్రమాదాలకు దారితీస్తున్నాయని తెలుస్తోంది. ఉక్కు తయారీలో వాడే ఫెర్రో మిశ్రమాల నాణ్యత కూడా చాలా నాసిరకంగా ఉంటుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. మెటీరియల్ లోపాలపై కూడా ఫోకస్ చేయాలని, కార్మికుల భద్రతకు సంబంధించి చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కేంద్ర మంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారా లోకేష్, ఎంపీ భరత్ సహా పలువురు నేతలు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మంగళవారం నాడు మృతుల కుటుంబాలను పరామర్శించి, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























