Vizag Beach Blue Flag: విశాఖలోని   ప్రసిద్ధ బీచ్‌లలో ఒకటైన రుషికొండ బీచ్‌ కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపును పునరుద్ధరించారు. ఈ సమచారాన్ని బ్లూ ఫ్లాగ్ ప్రతినిధులు కలెక్టర్ ను కలిసి తెలిపారు.  రుషికొండ బీచ్ 2020లో బ్లూ ఫ్లాగ్ గుర్తింపును పొందింది. ఈ గుర్తింపు పర్యావరణ సంరక్షణ, శుభ్రత, మరియు సురక్షిత పరిస్థితులను కలిగి ఉన్న బీచ్‌లకు ఇస్తారు.   భారతదేశంలో ఈ గుర్తింపు పొందిన మొదటి ఎనిమిది బీచ్‌లలో రుషికొండ ఒకటి. అయితే ఫిబ్రవరిలో ఈ గుర్తింపును తాత్కలికంగా నిలిపివేశారు.  పార్కింగ్ సౌలభ్యం లేకపోవడం, భద్రతా లోపాలు, వీధి కుక్కలు యధేచ్చగా తిరగడం, పరిశుభ్రత లేకపోవడం కారణంగా  ఉపసంహరించారు.                               

 అధికారులు బీచ్‌ నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ నిర్వహణను గాలికి వదిలేయడం, సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో బీచ్‌ అధ్వానంగా తయారైంది. బ్లూఫ్లాగ్‌ సర్టిఫికెట్‌ను తాత్కాలికంగా ఉపసంహరిస్తున్నట్లు ఎఫ్‌ఈఈ తెలిపింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పర్యాటక శాఖ అధికారులు   రమణ , జ్ఞానవేణి లను బదిలీ చేసిది.  జిల్లా టూరిజం అధికారి గా జి.దాసు ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రుషికొండ బీచ్ లో పరిశుభ్రతను, ప్రమాణాలను పాటించకుండా నిర్లక్ష్యం గా వహించిన ఇతర అధికారులనూ ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించి ఇతర అధికారుల్ని నియమించారు. విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ అధికారులు బ్లూ ఫ్లాగ్ పునరుద్దరణ పనులను పర్యవేక్షించారు.                       

 అధికారులు ఈ సమస్యలను పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకున్నారు.  మార్చి 4, 2025 నాటికి ఆడిట్ పూర్తి చేసి ఒక వారంలోపు గుర్తింపును పునరుద్ధరించాలని భావించారు. అయితే కాస్త ఆలస్యంగా మళ్లీ 22 వ తేదీ నాటికి బ్లూఫ్లాగ్ గుర్తింపు లభించింది.          

బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్  డెన్మార్క్‌లోని ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ  ఇస్తుంది.  భద్రతా ప్రమాణాలు, నాణ్యమైన నీరు, పర్యటకులకు నడక దారులు, టాయిలెట్లు, బట్టలు మార్చుకునే గదులు, సీసీ కెమెరాలు వంటి 33 రకాల ప్రమాణాలు పాటించే బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తుంది.  1985లో డెన్మార్క్‌లో ప్రారంభించిన 'ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్' ఏజెన్సీ 1987 నుంచి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్స్‌ని ఇస్తోంది.  ఆసియా ఖండంలో ఈ సర్టిఫికేట్ పొందిన తొలి బీచ్ ఒడిశాలోని కోణార్క్ తీరంలోని 'చంద్రబాగ్' బీచ్.   బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కలిగిన బీచ్‌లో నీలి జెండా ఎగుర వేస్తారు. అది ఆ బీచ్ శుభ్రత, నీటి నాణ్యత, అధిక భద్రతా ప్రమాణాలను కలిగి ఉందని, తీర ప్రాంతాల పర్యావరణాన్ని రక్షించే వ్యవస్థ ఉందని పర్యటకులు ఈ తరహా బీచ్‌లకు వచ్చేందుకు ఆసక్తి చూపుతారు.