Vizag AI City: భారత ఏఐ పవర్ హౌస్‌గా విశాఖ - రూ. 15 లక్షల కోట్ల పెట్టుబడులకు చాన్స్
AI powerhouse: ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రరాజ్యాల మధ్య పోటీ నెలకొంది. ఈ సమయంలో ఇండియాను ఏఐ పవర్‌హౌస్ గా మార్చేందుకు విశాఖపట్నం వేదిక కానుంది.

Visakhapatnam India AI powerhouse: అమెరికా, చైనాల తర్వాత ఏఐ రంగంలో భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం చుట్టూ 100 కిలోమీటర్ల పరిధిలో భారీ డేటా సిటీ ని నిర్మిస్తోంది. ఇది కేవలం డేటా నిల్వ కేంద్రం మాత్రమే కాకుండా, ఏఐ చిప్ డిజైనింగ్, సర్వర్ తయారీ, పరిశోధన , అభివృద్ధి కేంద్రాల కలయికగా ఉండబోతోంది. తైవాన్ దేశం 100 కిలోమీటర్ల వెడల్పులో ఏ విధంగా సెమీకండక్టర్ హబ్‌గా మారిందో, అదే తరహాలో వైజాగ్‌ను గ్లోబల్ ఏఐ హబ్‌గా మార్చాలని ప్రయత్నిస్తున్నారు.
గూగుల్, మెటా దిగ్గజాల భారీ పెట్టుబడులు
ఈ డేటా సిటీ ప్రాజెక్టులోకి ఇప్పటికే ప్రపంచ స్థాయి ఐటీ దిగ్గజాలు క్యూ కడుతున్నాయి. అక్టోబర్ 2025లో కుదిరిన ఒప్పందం ప్రకారం, గూగుల్ , అమెరికా వెలుపల తన అతిపెద్ద ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌ను వైజాగ్‌లో ఏర్పాటు చేసేందుకు సుమారు రూ. 1.25 లక్షల కోట్లు పెట్టుబడిని ప్రకటించింది. దీనితో పాటు రిలయన్స్-బ్రూక్‌ఫీల్డ్ జాయింట్ వెంచర్ రూ. 91,000 కోట్లు, మైక్రోసాఫ్ట్ , మెటా వంటి సంస్థలు కూడా భారీ వ్యూహాలతో ఇక్కడ అడుగుపెడుతున్నాయి. మొత్తంగా రూ. 15 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
6 గిగావాట్ల విద్యుత్ - కొవ్వాడ అణు ప్లాంట్ అండ
ఏఐ డేటా సెంటర్ల నిర్వహణకు అత్యంత కీలకమైనది నిరంతర భారీ విద్యుత్ సరఫరా. దీనికోసం ప్రభుత్వం 6 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని సిద్ధం చేస్తోంది. ఇందులో ఇప్పటికే 3 గిగావాట్లకు సంబంధించిన ఒప్పందాలు పూర్తయ్యాయి. ఈ భారీ అవసరాలను తీర్చేందుకు శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడ అణు విద్యుత్ ప్లాం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా, ఈ సెంటర్లను చల్లబరచడానికి సముద్రపు నీటిని వినియోగించుకునే వినూత్న కూలింగ్ టెక్నాలజీ ని ఇక్కడ అమలు చేస్తున్నారు.
సముద్ర గర్భ కేబుల్స్ - గ్లోబల్ కనెక్టివిటీ
విశాఖపట్నం తీరాన్ని అంతర్జాతీయ సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్స్ ల్యాండింగ్ పాయింట్‌గా మారుస్తున్నారు. గూగుల్ బ్లూ-రామన్ , మెటా వాటర్‌వర్త్ కేబుల్స్ ఇక్కడ ల్యాండ్ కావడం ద్వారా సింగపూర్, మలేషియా వంటి దేశాలతో వైజాగ్‌కు డైరెక్ట్ హై-స్పీడ్ కనెక్టివిటీ ఏర్పడుతుంది. ముంబై కంటే రెండు రెట్లు ఎక్కువ కేబుల్ నెట్‌వర్క్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడమే లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల ఇంటర్నెట్ లేటెన్సీ తగ్గి, సెర్చ్ ఇంజన్లు , ఏఐ అప్లికేషన్లు అద్భుతమైన వేగంతో పనిచేస్తాయి.
ప్రత్యేక దృష్టి పెట్టిన నారా లోకేష్
మంత్రి నారా లోకేష్ ఈ ప్రాజెక్టు ద్వారా 2032 నాటికి వైజాగ్ ఆర్థిక వ్యవస్థను 120 బిలియన్ డాలర్లకు చేర్చాలని, లక్షలాది మంది యువతకు ఉన్నత స్థాయి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భూమి ధరలను అతి తక్కువగా అందించడం ద్వారా గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నారు. కేవలం డేటా నిల్వకే కాకుండా, సర్వర్ తయారీ , శీతలీకరణ వ్యవస్థల పరిశ్రమలను కూడా ఇక్కడికి తీసుకురావడం ద్వారా ఒక సంపూర్ణ పారిశ్రామిక ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తున్నారు.























