CP Trivikram: విశాఖ రెండు వేల రూపాయల నోట్ల మార్పిడి కేసు గురించి వైజాగ్ సీపీ త్రివిక్రమ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బాధితులైన నావెల్ అధికారులు శ్రీధర్, శ్రీను డీసీపీ విద్యా సాగర్ నాయుడుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈక్రమంలోనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. నావెల్ విశ్రాంత అధికారులు, శ్రీధర్ శ్రీను రెండు వేల నోట్లు మార్చే ప్రయత్నంలో 90 లక్షలు ఇస్తే కోటిరూపాయిలు ఇస్తామని సూరి అనే మధ్యవర్తి ద్వారా ఒప్పందం చేసుకున్నారని సీపీ త్రివిక్రమ్ వర్మ పేర్కొన్నారు. ఎన్ఆర్ఐ హాస్పిటల్ సమీపంలో 90 లక్షలు ఇస్తే.. కోటి రూపాయిలు ఇవ్వడానికి ఒప్పుకున్నారని స్పష్టం చేశారు. గోపి అనే ఉద్యోగి, సూరి అనే మధ్యవర్తి ద్వారా వ్యవహారం నడిచిందని వివరించారు.
సెప్టెంబర్ వరకూ సమయం ఉంది.. మధ్యవర్తుల మాటలు నమ్మద్దు
మధ్యవర్తి సూరి ఆ విషయాన్ని రిజర్వ్ సీఐ స్వర్ణలత డ్రైవర్ మెహర్, శ్రీనుకు చెప్పగా.. వాళ్లు సీఐ స్వర్ణలతకు చెప్పినట్లు సీపీ త్రివిక్రమ్ వర్మ వెల్లడించారు. ఈక్రమంలోనే గురువారం మధ్యవర్తి సూరితో డీల్ కుదుర్చుకుని ఆ తర్వాత అతడిని కొట్టినట్లు చెప్పారు. స్వర్ణ లత డ్రైవర్స్ మెహర్, శ్రీను ఇద్దరూ సూరిపై దాడి చేశారని వెల్లడించారు. ఆదాయపు పన్ను లేదా టాస్క్ ఫోర్స్ కి చెబితే మొత్తం సొమ్ము పోతుందని.. కాబట్టి కమిషన్ ఎక్కువ ఇవ్వాలని బెదిరించినట్లు స్పష్టం చేశారు. నేవల్ అధికారులు కొల్లి శ్రీను, శ్రీధర్ జరిగిన విషయం తెలుసుకొని షాక్ అయ్యారని.. అయినప్పటికీ ఎక్కువ కమిషన్ ఇవ్వాలని పట్టుబట్టి అడిగి మరీ 20 లక్షలు కమిషన్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈక్రమంలోనే నేవల్ అధికారులు సూరిని నిలదీయగా.. స్వర్ణలత డ్రైవర్ మెహర్, శ్రీను వచ్చి నేవల్ అధికారులను బెదిరించినట్లు వెల్లడించారు.
ఏ1 సూరి, ఏ 4 గా స్వర్ణలత
ఈ కేసులో సూరిని ఏ1 నిందితుడుగా, రిజర్వ్ పోలీస్ సీఐ స్వర్ణలతని ఏ4 నిందితురాలిగా చేర్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు సాగుతోందని వైజాగ్ సీపీ త్రివిక్రమ్ వర్మ వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ నెలాఖరు వరకు నోట్లు మార్చుకునే అవకాశం ఉందని... కాబట్టి ప్రజలంతా దయచేసి మధ్యవర్తులు మాట నమ్మవద్దంటూ సూచించారు.
స్వర్ణలత చాలా కాలం పాటు విశాఖ కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వహించారు. స్థానికంగా ఉండే రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. సీఐ పైనే ఫిర్యాదు రావడంతో ఈ విషయం బయటకు రాకుండా చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ రాత్రి మీడియాకు తెలిసిపోవడంతో చేసేదేమీ లేక పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
సినిమాలపై ఆసక్తి
స్వర్ణ లత సినిమాల్లో నటించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం షార్ట్ ఫిల్మ్ ల్లో నటించిన ఆవిడ.. ఇప్పుడు మూవీలోనే నటించే ప్రయత్నాలు చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్లు కూడా రిలీజ్ అయ్యాయి. ఆ రాజకీయ నేతకు సినీ పరిశ్రమతోనూ సంబంధాలు ఉన్నాయి.