Pahalgam Terror Attack: జమ్ముకశ్మీర్‌లోని పహల్‌గామ్‌ జరిగిన ఉగ్రదాడిలో 27 మంది చనిపోయారు. పర్యాటక ప్రదేశాలు చూసేందుకు వెళ్లిన పర్యాటకులపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. దాదాపు నలభైకుపైగా రౌండ్ల బులెట్ల వర్షం కురిపించారు. కశ్మీర్‌లో ఉన్న పరిస్థితి తెలుసుకున్న వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలా భయపడుతున్న వారిలో వైజాగ్ వాసులు కూడా ఉన్నారు. 

విశాఖలోని పాండురంగాపురం వాసులు సమ్మర్ హాలిడేస్‌లో కశ్మీర్‌ చూసేందుకు వెళ్లారు. ఇప్పుడు వాళ్లలో కొంందరి జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు ఫ్యామిలీలు టూర్ వెళ్లాయి. ఈ ఉగ్రదాడి తర్వాత రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళితోపాటు మరో రెండు జంటలు కూడా కనిపించడం లేదు.  

ఉగ్రదాడి గురించి తెలుసుకున్న బంధువులు వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. వారు ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారో తెలియకపోవడంతో కాస్త టెన్షన్ పడుతున్నారు.  వాళ్లకు ఫోన్ చేసినప్పటికీ కలవడం లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకొని వారి ఆచూకీ చెప్పాలని వేడుకుంటున్నారు. 

పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత, జమ్మూకశ్మీర్ సమాచార, ప్రజా సంబంధాల శాఖ హెల్ప్‌లైన్ నంబర్‌లను జారీ చేసింది. దీని ద్వారా దేశం, ప్రపంచం నలుమూలల ప్రజలు పహల్గామ్‌లో చిక్కుకున్న బంధువుల  యోగక్షేమాలను తెలుసుోకవచ్చు. 0194-2457543 , 0194-2483651 లను జారీ చేసింది. ఈ లైన్లు బిజీగా ఉంటే, శ్రీనగర్ ADC ఆదిల్ ఫరీద్ మొబైల్ నంబర్ 7006058623కు కాల్ చేయవచ్చు. దీనితో పాటు, అనంతనాగ్ పోలీసులు పర్యాటకులకు సహాయం చేయడానికి హెల్ప్‌లైన్ నంబర్‌లు విడుదల చేశారు. సహాయం అడగడానికి లేదా సమాచారం పొందడానికి మీరు 9596777669, 0193-32225870 నంబర్లకు కాల్ చేయవచ్చు. మీరు 9419051950 నంబర్‌కు వాట్సాప్ సందేశాలను కూడా పంపవచ్చు.

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మందిని బలిగొన్న ఘోరమైన ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పహల్గామ్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసారన్ అనే అందమైన మైదానంలో ఈ ఘటన జరిగింది, ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు.

మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. 'మినీ స్విట్జర్లాండ్' అని కూడా పిలిచే సుందరమైన గడ్డి మైదానంలో పర్యాటక అందాలను ఆస్వాదిస్తున్న పౌరులపై ఉగ్రవాదులు 50 రౌండ్లకుపైగా కాల్పులు జరిపారు. పర్యాటకులు ఆనందంగా, గుర్రాలు స్వారీ చేస్తూ, లోకల్‌ ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తున్న టైంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.