వార్డు కౌన్సిల్‌గా ఎన్నికై దాదాపు మూడేళ్లు అవుతున్నా తన ప్రజల కోసం ఏ చేయలేకపోతున్నానని ఆవేదనతో ఓ కౌన్సిలర్ చెప్పుతో కొట్టుకోవడం వైరల్‌గా మారింది. నర్సీపట్నం మున్సిపల్ సమావేశంలో జరిగిన ఘటన నేషల్ మీడియాలో కూడా మారుమాగిపోయింది.
నర్సీపట్నం మున్సిపాలిటీలోని 20వ వార్డుకు చెందిన రామరాజు తన వార్డు సమస్యలు ప్రస్తావిస్తూ గిరిజన గ్రామ ప్రజలకు ఎలాంటి పనులు చేయలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు సరిగా లేవని, కుళాయిల్లో పూడిక తీయలేదని, చెత్తకు తరలించడం లేదని, వీధి దీపాలు కూడా వెలగడం లేదని ఆరోపించారు.
ప్రతి పనిని కూడా రాజకీయ కోణంలో చూస్తున్నారని రామరాజు ఆరోపించారు. పనులు చేయడానికి ముప్పు తిప్పలు పెడుతున్నారని టీడీపీకి చెందిన కౌన్సిలర్ ఆరోపిస్తూ చెప్పు తీసి కొట్టుకున్నారు. ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. జాతీయ మీడియా సైతం దీన్ని ప్రముఖంగా ప్రచురించింది.
రెండేళ్ల కిందట ఎమ్మెల్యేగా ఉన్న గణేష్ ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదని... ప్రజలకు ముఖం చూపించుకోలేకపోతున్నామని అన్నారు రామరాజు. కొన్ని సార్లు చనిపోవాలనిపిస్తోందని అన్నారు. అలా ఏమోషన్ అవుతూనే చెప్పు తీసి కొట్టుకున్నట్టు వీడియోలో ఉంది.
టీడీపీకి చెందిన కౌన్సిలర్ ఇలా చెప్పుతో కొట్టుకోవడంతో కౌన్సిల్‌లో గందరగోళం నెలకొంంది. ఆయనపై వైసీపీ సభ్యులు తిరగబడ్డారు. మాటల దాడి చేశారు. ఆయనకు మద్దతుగా టీడీపీ సభ్యులు లేచారు.
కావాలనే టీడీపీ సభ్యులు ఇష్యూను రాజకీయం చేస్తున్నారని అసలు చంద్రబాబు హాయం నుంచే పనులు జరగడం లేదని ఆరోపించారు వైసీపీ లీడర్లు. వాటిని మర్చిపోయి ఇప్పుడేదో పనులు జరగడం లేదని ఆరోపించడం కరెక్ట్ కాదంటూ ఎదురుదాడికి దిగారు. ఇలా తీవ్ర గందరగోళం మధ్యే సభ వాయిదా పడింది.