Ganta Srinivas Rao: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లిలో గంటను పోటీ చేయమన్నారంటూ కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం స్పందించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. పార్టీ అధినాయకత్వం తనను చీపురుపల్లి వెళ్ళమని చెప్పిందని, అయితే తనకు విశాఖలోనే పోటీ చేయాలని ఉందని స్పష్టం చేశారు. చీపురుపల్లి వెళ్లాలని సూచించిన అధిష్టానం సూచనను పరిశీలిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.


ఇప్పటివరకు తాను పోటీ చేసిన నియోజకవర్గాలన్నీ విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని సీట్లేనని, ఇప్పుడు తనకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న చీపురుపల్లి వెళ్లాలని అధిష్టానం చెబుతోంది అన్నారు. జిల్లా కూడా వేరు కాబట్టి ఆలోచనలో పడ్డానని గంటా స్పష్టం చేశారు. చీపురుపల్లిలో పోటీపై ఆలోచించుకొని తన నిర్ణయాన్ని హైకమాండ్ కు చెబుతానని గంటా వెల్లడించారు. తనకు మాత్రం విశాఖ నుంచి పోటీ చేయాలని ఉందని స్పష్టం చేశారు. చీపురుపల్లి లో సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి పోటీ చేయాలన్న ఆలోచన అధినాయకత్వం చేసిందని, దీనిపై ఆలోచన చేస్తున్నానని పేర్కొన్నారు. చీపురుపల్లి పోటీ అన్నది తనకు సర్ప్రైజ్ అని స్పష్టం చేశారు. పోటీ చిన్న విషయం కాదన్నారు. 


నార్త్ నుంచి పోటీ చేయడం లేదు


ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నార్త్ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని గంటా స్పష్టం చేశారు. విశాఖ నార్త్‌ లో వేరే ఇన్ ఛార్జ్ ని పెట్టమని చెప్పినట్టు వెల్లడించారు. విశాఖ జిల్లా నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నానని, అధిష్టానం సూచించిన దాన్ని పరిశీలిస్తున్నానని స్పష్టం చేశారు. తనను ఈ జిల్లా నుండి పంపేద్దాం అనుకుంటున్నారా..? అని గంటా శ్రీనివాసరావు మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. పార్టీ నాయకులకు తన అభిప్రాయాన్ని చెప్తానని అన్నారు. టీడీపీ, జనసేన సీట్ల లెక్క తేలలేదని, ఆ తరువాతే నా పోటీపై స్పష్టత రానుందన్నారు. పొత్తులో భాగంగా పోటీ చేయబోయే నాలుగు సీట్లపై మాత్రమే స్పష్టత వచ్చిందన్నారు.