వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని వైఎస్‌ఆర్‌సీపీ అధిష్టానం ఇప్పటికే దూకుడు పెంచేసింది. ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్న చాలామంది సిట్టింగులకు టిక్కెట్టు నిరాకరిస్తోంది. మరికొందరి స్థానాలను మారుస్తోంది. కీలకమైన వ్యక్తుల సీట్లను ఏం చేయబోతోంది అనే ఆసక్తి చాలా మందిలో ఉంది. అలాంటి నియోజకవర్గాల్లో ఒకటి ఆమదాలవలస.


ఆమదాలవలపై రకరకాల ఊహాగానాలు


ఆమదాలవలస నుంచి కొత్తవారికి అవకాశం కల్పిస్తారని, తమ్మినేనిని పార్లమెంట్‌కు పంపిస్తారని ప్రచారం జరిగింది. ఆయనపై ఉన్న వ్యతిరేకత, నియోజకవర్గం పార్టీలో గ్రూపుల గోల కారణంగా ఆయన్ని అక్కడి నుంచి తప్పిస్తారని అనుకున్నారు. ఈ సస్పెన్స్‌కు అధిష్ఠానం తెర దించిందని చెబుతున్నారు. 


తమ్మినేని ఖాయం


వచ్చే ఎన్నికల్లో ఆమదాలవలస నుంచి ఫ్యాన్‌ గుర్తుపై తమ్మినేని సీతారాం బరిలోకి దిగడం ఖరారైపోయిందని ప్రచారం జరుగుతోంది. తాడేపల్లిలోని సీఎంఓ పెద్దలతో ఐ-ప్యాక్ టీంతో తమ్మినేని చర్చించారు. వచ్చే ఎన్నికల్లో ఆమదాలవలస బరిలో మరోసారి తమ్మినేని ఉంటారని అధిష్ఠానం క్లారిటీ ఇచ్చేసినట్లు విశ్వశనీయంగా తెలిసింది. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదు. 


ఆమదాలవలస టికెట్‌ తమ్మినేనికి ఖరారు అయిపోయిందని ఆయన వర్గం ప్రచారం చేస్తుంటే... ఆశావాహులు ప్రయత్నాన్ని విరమించుకోవడం లేదు. అధికార ప్రకటన వచ్చే వరకు విశ్రమించబోమంటున్నారు. సుదీర్ఘ అధ్యయనం అనంతరమే వైసీపీ ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఆమదాల వలసలో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న కూన రవిని ఎదుర్కొనే సత్తా సీతారాంకే ఉందని సర్వేల్లో తేలిందని చెబుతున్నారు. 


ఆమదాలవలస సీటు విషయాన్ని మరింత సాగతీయడం ఇష్టం లేక తమ్మినేనికి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. నియోజకవర్గ లీడర్లను పిలిచి మాట్లాడే బాధ్యతను ఐ-ప్యాక్‌కు అప్పగించారట. ఇక్కడ వైసీపీలో చాలా గ్రూపులున్నా సువ్వారి గాంధీ మినహా వేరెవ్వరికి క్షేత్రస్థాయిలో పట్టులేదు. గాంధీ కూడా పార్టీ పెద్దలను దిక్కరించే పని చేయరు. ఈ లెక్కల తర్వాత సీతారామే సరైన అభ్యర్థి అని ఖరారు చేసిందట. తమ్మినేనికి స్పష్టమైన సంకేతాలను ఇచ్చిందని సమాచారం.


కీలకంగా వ్యవహరించిన బొత్స 
తమ్మినేనిపై పార్టీలోనూ, ప్రజల్లోనూ వ్యతిరేకత ఉందని, మరోసారి టికెట్టు ఇస్తే ఓటమి ఖాయమని జిల్లా నాయకుడే అధిష్ఠానానికి చెప్పారట. దీంతో పాటు కొన్ని సర్వేలను ఆధారంగా చేసుకొని ఆమదాలవలస సీటుపై డైలమా కొనసాగింది. ఒకానొక దశలో తమ్మినేనిని ఎంపీగా పంపి ఆమదాలవలస నుంచి డాక్టర్ దానేటి శ్రీధర్ లేదా సువ్వారి గాంధీని కన్ఫామ్ చేయాలనుకున్నారు. కొత్త ముఖంతోనే అక్కడ నెగ్గుకురాగలమని సీనియర్ నేత ప్రచారం చేశారు. విషయం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బొత్స దృష్టికి వెళ్లింది. 


సీతారాంను తప్పిస్తారన్న ప్రచారం ఊపందుకున్నటైంలో బొత్స కలుగజేసుకున్నారు. ఇంతలో జిల్లాకు చెందిన పలువురు కాళింగ సామాజికవర్గ పెద్దలు బొత్సను కలిశారు. ఆమదాలవలస టిక్కెట్ తమ్మినేనికే ఇవ్వాలని రిక్వస్ట్ చేశారు. అధిష్టానంతో బొత్స మాట్లాడారు. ఆమదాలవలస టిక్కెట్టు విషయంలో తొందరపాటు వద్దని చెప్పుకొచ్చారు. పొందూరు మండలంలో బొత్సకు ఇప్పటికీ బలమైన అనుచరగణం ఉంది. పొందూరు, బూర్జ, సరుబుజ్జిలి మండలాలకు చెందిన తూర్పుకాపు నేతలంతా బొత్సతో సన్నిహిత సంబంధాలు నెరుపుతారు. తన శైలిలో బొత్స తాజా పరిస్థితులపై నివేదికను అధిష్ఠానం ముందు ఉంచారు.


బొత్స చెప్పినదానితో సంతృప్తి చెందిన పార్టీ పెద్దలు సీతారామే సరైన అభ్యర్థి అనే నిర్ణయానికి వచ్చారట. ఆ విషయాన్ని తమ్మినేని పిలిచి చెప్పేశారని ప్రచారం.