Ponduru Khadi GI Tag: తరాల చరిత్రను తన ప్రతీ నూలు పోగులో మోస్తున్న పొందూరు ఖాదీకి ప్రపంచ స్థాయిలో విశేష గుర్తింపు లభించింది. సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న శ్రీకాకుళం జిల్లా నేత కార్మికుల వారసత్వానికి భౌగోళిక గుర్తింపు లభించింది. వాణిజ్య పరిశ్రమల శాఖ పరిధిలోని భౌగోళిక సూచికల రిజిస్ట్రీ శుక్రవారం దీనికి సంబంధించిన అధికారిక పత్రాన్ని జారీ చేసింది. దీని ద్వారా పొందరు ఖాదీ పరిశ్రమకు చట్టపరమైన రక్షణ లభించింది. ఈ గుర్తింపు రావడం అనేది కేవలం ఒక వస్త్రానికి లభించిన గుర్తింపు కాదని, శ్రీకాకుళం నేత కార్మికుల అపారమైన వారసత్వానికి లభించిన గౌరవమని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
దశాబ్ధాల నిరీక్షణకు దక్కిన ఫలితం
పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్ సాధించడం వెనుక ఎన్నో సంవత్సరాల నిరీక్షణ, అవిశ్రాంత కృషి దాగి ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. లెక్కలేనన్ని సమావేశాలు, సమగ్ర డాక్యుమెంటేషన్, నిరంతర ఫాలో అ్‌ల ఫలితంగా ఈ ప్రతిష్టాత్మకమైన గుర్తింపు సాధించగలిగామని ఆయన వెల్లడించారు. ఈ శుభవార్తను ఆయన స్వయంగా శుక్రవారం ఎక్స్ వేదికా పంచుకున్నారు. ఒక శ్రీకాకుళం వాసిగా తనకు ఇది ఎంతో గర్వించదగ్గ క్షణం అని పేర్కొన్నారు.
పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ లభించడంపై జిల్లా వాసులు అపారమైన హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గుర్తింపు ద్వారా శ్రీకాకుళం గర్వం నేడు దేశానికే గర్వారణంగా మారిందని ఆయన కొనియాడారు.
ఖ్యాతిని పెంచే భౌగోళిక గుర్తింపు
దేశవ్యాప్తంగా అరుదైన అత్యంత ప్రత్యేకమైన ఉత్పత్తులు, వస్తువులు ఎన్నో ఉన్నాయి. వాటిలో అత్యుత్తమమైన నాణ్యత విశిష్టత కలిగిన వాటికి మాత్రమే ఈ భౌగోళిక గుర్తింపును ఇస్తారు. ఒక ఉత్పత్తికి జిఐ ట్యాగ్ లభిస్తే దాని విశిష్టత మరింత విస్తృతమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా దానికి డిమాండ్ పెరుగుతుంది.
పొందూరు ఖాదీకి సంబంధించిన నాణ్యత ప్రత్యేకత సహజంగా ఆ ప్రాంతంలో తయారయ్యే వస్తువుల లక్షణంగా నిలుస్తుంది. ఈ ప్రత్యేకమైన విశిష్టతను దృష్టిలో ఉంచుకొని, వాటికి మరింత ప్రాధాన్యత ఇచ్చే ఉద్దేశంతోనే జియో గ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గడ్స్ యాక్ట్ 1999ను రూపొందించారు. ఈ చట్టం ప్రకారం ఒక ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతం నుంచి వచ్చే ఉత్పత్తులకు మాత్రమే ఈ భౌగోళిక గుర్తింపు వర్తిస్తుంది.
ఈ చట్టపరమైన గుర్తింపు ద్వారా అతి పెద్ద ప్రయోజనం ఏంటంటే... మార్కెట్‌లో నకిలీ ఉత్పత్తులకు, కల్తీకి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. జిఐ ట్యాగ్ పొందిన తరువాత ఆ ఉత్పత్తిని అదే పేరుతో వేరే ప్రాంతంలో తయారు చేసి విక్రయించడం సాధ్యపడదు. దీని వల్ల అసలైన నేత కార్మికులకు రక్షణ లభిస్తుంది.
జీఐ ట్యాగ్ నెంబర్ 1049
పొందూరు ఖాదీకి భౌగోళిక సూచికల రిజిస్ట్రీ ఐజీ ట్యాగ్ నెంబర్ 1049 కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నై కేంద్రంగా ఉన్న భౌగోళిక సూచికల రిజిస్ట్రీ ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని అధికారికంగా వెలువరించింది.
ఈ గుర్తింపు ద్వారా పొందూరు ఖాదీ దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఉత్పత్తుల సరసన చేరింది. ఇంత వరకు బాస్మతి బియ్యం, డార్జిలింగ్ తేయారు, కాంచీపురం పట్టు చీరలు, పోచంపల్లి చీరలు, మైసూర్ పట్టు, నిర్మల్ బొమ్మలు, మైసూర్ శాండిల్ సబ్బు వంటి అరుదైన జాబితాలో ఇప్పుడు పొందూరు ఖాదీ కూడా స్థానం సంపాదించింది. ఈ ఉన్నత జాబితాలో చోటు దక్కడం అనేది పొందూరు ఖాదీ నాణ్యత, చారిత్రక ప్రాధాన్యతకు నిదర్శనం
మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రం
పొందూరు ఖాదీ చరిత్ర భారత స్వాతంత్య్ర ఉద్యమంతో ముడిపడి ఉంది. ఈ వస్త్రం భారత స్వాతంత్య్ర ఉద్మయంలో కీలకమైన పాత్ర పోషించింది. దేశ పితామహుడు మహాత్మాగాంధీకి పొందూరు ఖాదీ అత్యంత ప్రియమైన వస్త్రంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి నూలు పోగులో తరతరాల చరిత్రను మోస్తూ పొందూరు ఖాదీ ఒక వస్త్రంగానే కాకుండా భారతీయ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది.