Srikakulam News Today: భూకబ్జాలు, ఇసుక దందాలు, ఇతర అక్రమాల్లో గతపాలకుల ఘనకీర్తి రాష్ట్రమంతటా విస్తరించగా, ఆ నేతల వ్యక్తిగత సహాయకుల(పీఏలు) అవినీతి లీలలు సైతం ఇప్పుడు బహిర్గతమవుతున్నాయి. కొంతమంది పీఏలు చిరు ఉద్యోగులే అయినప్పటికీ వారు మాత్రం అవినీతి అనకొండలుగా ఎదిగిన తీరు ఎవరికైనా విస్మయం కలిగించకమానదు. వైసీపీ హయాంలో ఉపముఖ్యమంత్రి హెూదాలో రెవెన్యూ శాఖను నిర్వహించిన ధర్మాన కృష్ణదాస్ వద్దపీఏగా అయిదేళ్లు పనిచేసిన మురళి అక్రమ సంపాదన తీరు చూసి ఏసీబీ అధికారులు షాక్ తిన్నారు. ఈ వ్యక్తిగత సహాయకుడు ఎవరి సహాయం లేకుండానే ఎలా కోట్లకు పడగెత్తారన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. 


బుడితి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో సాధారణ ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కృష్ణదాస్ పీఏ మురళిఅక్రమ ఆస్తులపై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు పలు చోట్ల ఏకకాలంలో గంటల తరబడి సోదాలు చేశారు. మురళి స్వగ్రామమైన దంతలోనూ, శ్రీకాకుళం, విశాఖపట్నంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేయగా భారీగా బంగారు, వెండి ఆభరణాలే గాక పలు భవంతులు, ఇళ్లస్థలాలు, పొలాలకు సంబంధించిన పత్రాలు గుర్తించారు. 


నెలజీతగాడైన మురళికి కోట్లాది రూపాయల ఆఆస్తులు సమకూరడం కలయో, నిజమో, 'కృష్ణ'మాయో తెలియక ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. విలువైన ఆభరణాలు, ఖరీదైనభవనాలు, కట్టలకొద్దీ ఆస్తులు చూశాక 'మనవాడు గట్టి పిండమే’అటూ మురళి గురించి తెలిసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు. మురళి బంధుమిత్రుల ఇళ్లల్లోనూ ఏసీబీ దాడులు జరిగాక, ఇన్ని ఆస్తులు ఓ చిరుద్యోగి ఎలా సంపాదించాడన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. 


మురళి కొంతమంది వైసీపీనేతలకు బినామీలుగా ఉన్నాడన్న వాదనలు లేకపోలేదు. అక్రమ ఆస్తుల వ్యవహారంలో మురళి దోషి అని తేలితే, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు పోగేసినట్టు మురళిపై వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పుడు ధర్మాన కృష్ణదాస్ వద్ద పీఏగా పని చేస్తున్నందున అధికారులు దృష్టి పెట్టలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక వైసీపీ నేతల, వారి అనుచరుల అవినీతిపై యంత్రాంగం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే మురళి అవినీతి బయటపడింది.  


నాటి పాలకుల అండదండలు లేకుండానే చిరుద్యోగులైన పీఏలు కోట్లకు ఎలా పడగెత్తగలరన్న సందేహాలు వినిపిస్తున్నాయి. భూకబ్జాలు, ఇసుక దందాలే కాదు, కాంట్రాక్టర్ల వద్ద భారీగా లంచాలు, ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులకు విచ్చలవిడిగా కమీషన్లు దండుకుని కొంతమంది పీఏలు అక్రమ సంపాదనలో చెలరేగిపోయారన్న ఫిర్యాదులపై ఇప్పుడు వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. కేవలం పీఏలపైనే కాదు, వైసీపీ పాలనలో కీలక పదవులు నిర్వహించిన నేతలపై కూడాఏసీబీ యంత్రాంగం దృష్టి పెట్టాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. 


కక్షసాధింపులతో కాదు, నేరం చేసేవారందరికి చట్టపరంగా శిక్షలు తప్పవని కూటమి ప్రభుత్వం చెబుతున్న మాటలు ఆచరణ రూపం దాలుస్తాయా..? చిన్నాపెద్దా తేడా లేకుండా అక్రమార్కులందరి అవినీతి చిట్టాలు బహిర్గతం చేస్తారా..? వైసీపీ నేతల బినామీలను రచ్చకీడుస్తారా..? అవీనీతి అంతం.. మా పంతం అంటున్న కూటమి పాలకుల హెచ్చరికలు ఫలిస్తాయా..? వేచిచూడాల్సిందే..!


"ఎమ్మెల్యే లెటరుందా? అయితే తిరుమలకు వెళ్లవచ్చు" ఇదీ తెలుగునాట వెంకన్న భక్తుల ఆలోచన. తిరుపతిలో వసతి సౌకర్యం, స్వామివారి దర్శనం వంటివి సులభంగా లభించాలంటే ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు ఉండాలని చాలామంది భక్తులు ఎగబడుతున్నారు. దీంతో చాలామంది ఎమ్మెల్యేల పీఏలు చేతివాటం చూపుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తమకు ఏ పనులు చేయకపోయినా, కనీసం తిరుపతికి సిఫార్సులు లేఖలైనా ఇవ్వాలని చోటామోటా నాయకులు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తుంటారు. పీఏలు కరుణిస్తేనే ఆ లేఖలు దక్కుతాయని కార్యకర్తలు వాపోతున్నారు. వచ్చే ఫిబ్రవరిలో తిరుపతికి వెళ్తామంటే మూడు నెలల ముందుగానే అంటే అక్టోబరులోనే సిఫార్సు లేఖలు అయిపోయావని పీఏలు చెబుతున్నారు. కాసులకు కక్కుర్తిపడే కొందరు పీఏలు ఈ లేఖలను బహిరంగంగానే విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొంతమంది తెలివైన పీఏలు ఖాళీ సిఫార్సు లేఖలను తిరుపతిలోనే బ్రోకర్కు టోకెన్ విక్రయిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఆదాయం వనరుగా మారడంతో సిఫార్సు లేఖల భాగోతంలో అవినీతి గుప్పుమంటోంది. 


సింహాచలం మనోడే:
సిక్కోలు జిల్లాకు చెందిన సింహాచలం అనే అధికారిపై అవినీతి నిరోధక శాఖ దృష్టి సారించడంతో అతని అక్రమ సంపాదన గుట్టురట్టైంది. శ్రీకాకుళం, విశాఖతోపాటు మరికొన్ని చోట్ల ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేయడంతో సింహాచలం ఘనత అందరికి తెలిసింది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లోని మధురవాడ జోనల్ కమిషనర్‌గా పని చేస్తున్న సింహాచలం భారీ ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇతనికి పలు నగరాల్లో విలువైన ఇళ్ల స్థలాలు, భారీ భవంతులు, ఖరీదైన ఆభరణాలు ఉన్నట్టు తేలింది.