Andhra Pradesh News: సోషల్ మీడియాలో అభ్యంతర పోస్టులు (Objectionable Posts) సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, పార్టీలకు ఇబ్బందికరంగా మారాయి. అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు పెట్టి వ్యక్తిగతంగా డ్యామేజ్ చేస్తున్నారు. మాటల్లో చెప్పలేని విధంగా కామెంట్లు చేస్తున్నారు. ప్రత్యర్థులపై తప్పుడు పోస్టులు పెట్టడానికి ఇతరుల ఐడీలను ఉపయోగిస్తున్నారు. దీంతో ఫేక్ పోస్టులు పోడుతున్న వారిని పట్టుకోవడం పోలీసులకు ఇబ్బందికరంగా మారుతోంది. కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి(Ys Sharmila), ఆమె తల్లి వైఎస్ విజయమ్మ ( Ys Vijayamma), వైఎస్ సునీతా రెడ్డి (Ys Sunitha Reddy)లపై...సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా పోస్టులు పెడుతున్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సోషల్ మీడియాలో దాడి మరింత పెరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శల పెంచడంతో...సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర వీడియోలు, పోస్టులు పెడుతున్నారు. దీనిపై వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. 


అసభ్యకర పోస్టులు పెడుతున్న ఉదయ్ భూషణ్ అరెస్టు                    
తాజాగా సామాజిక మాధ్యమంలో వైఎస్‌ షర్మిల, వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ సునీతారెడ్డిపై అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నం మహారాణిపేటకు చెందిన పినపాల ఉదయ్‌ భూషణ్‌... పులివెందులకు చెందిన వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలు క్రియేట్ చేశారు. వైఎస్‌ షర్మిల, వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ సునీతారెడ్డిపై అసభ్యకర పోస్టులు పెడుతున్నాడు. తన పేరుతో ఎవరో అసభ్యకరంగా పోస్టులు పెట్టడాన్ని గుర్తించిన రవీంద్రారెడ్డి... పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సైబర్‌ పోలీసుల సాయంతో ఫేస్‌బుక్‌ ప్రతినిధుల నుంచి పోలీసులు వివరాలు తెప్పించుకున్నారు. వర్రా రాఘవరెడ్డి పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నది ఉదయ్‌ భూషణ్‌ను నిందితుడిగా నిర్దారించారు. కడప పోలీసులు  విశాఖపట్నం వెళ్లి ఉదయ్‌ భూషణ్‌ను అరెస్టు చేశారు. వైసీపీ సోషల్ మీడియా సభ్యుడైన వర్రా రవీంద్రారెడ్డిని...సొంత పార్టీ వారి చేత తిట్టించడం, కొట్టించడమే కోసమే ఉదయ్‌ భూషణ్‌ ఇలా చేసినట్లు విచారణలో వెల్లడైంది. 


సునీతారెడ్డి పోలీసులకు ఫిర్యాదు
తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య విషయంలో చివరి వరకు పోరాటం చేస్తామని సునీతారెడ్డి స్పష్టం చేశారు. రాజకీయంగా షర్మిల వెంట అడుగులు వేస్తానని ప్రకటించారు. దీంతో అక్కడి నుంచి షర్మిల, సునీతలను టార్గెట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. కొందరైతే శత్రు శేషం ఉండకూడదు .. వారిద్దరిని చంపేయాలి అన్నట్టు పోస్టులు పెట్టారు.  అసభ్యకర పోస్టుల వ్యవహారంపై వైఎస్ సునీతారెడ్డి...తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా పోస్టులపై షర్మిల సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పేరిట పోస్టులు పెడుతున్నారని ఏపీ పోలీసులు చెబుతుండగా… హైదరాబాద్ కేంద్రంగా వైసీపీ నేతలే షర్మిలపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఫేక్ పోస్టుల వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది.