ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయడంపై ప్రజలకు వచ్చే నష్టం ఏంటని మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని రైతులను ప్రశ్నించారు. తమ ప్రభుత్వానికి 26 జిల్లాలు సమానమేనని అన్నారు. 29 గ్రామాల కోసం రాష్ట్రానికి సమస్య సృష్టించడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం కాకూడదనే ఉద్దేశంతో, రాష్ట్ర ప్రయోజనాల కోసమే విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా చేస్తున్నామని బొత్స సత్యనారాయణ అన్నారు. శ్రీబాగ్‌ ఒప్పందం మేరకే కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో టాప్‌-5 నగరాల్లో విశాఖ ఉందని.. శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. విశాఖపట్నంలో ల్యాండ్ పూలింగ్ లో రైతుల నుండి ఆరు వేల ఎకరాలను తీసుకున్నామని బొత్స తెలిపారు.వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో పాలనా వికేంద్రీకరణపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత బొత్స విలేకరులతో మాట్లాడారు.


3 రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్‌ తన వైఖరిని స్పష్టంగా చెప్పారని అన్నారు. అమరావతికి తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని, వికేంద్రీకరణతోనే రాష్ట్రమంతా అభివృద్ధి జరుగుతుందని చెప్పారని అన్నారు. అమరావతికి తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని ఏ మంత్రి  స్పష్టం చేశారు. భూములిచ్చిన రైతులకు గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలకు వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని మరో ఐదేళ్లు తమ ప్రభుత్వం పొడిగించిందని మంత్రి తెలిపారు. అమరావతి పేరుతో చంద్రబాబు సర్కారు రియల్ ఏస్టేట్ వ్యాపారం చేసిందని బొత్స విమర్శించారు.


అందరి అభిప్రాయాలు తెలుసుకొనే మూడు రాజధానులనే నిర్ణయం చెప్పామన్నారు. ఎవరినీ తక్కువ చేయాలనే ఉద్దేశం తమకు లేదని అన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాలు అభివృద్ది చెందాలని కోరుకోవడం ధర్మం అని ఆయన పేర్కొన్నారు. అలా చేయనిపక్షంలో మంత్రి పదవికి తాను అనర్హుడినని అన్నారు.


14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు కొద్ది మంది కోసం సంపదను దోచిపెడతామంటే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. అభివృద్ది ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమైతే మళ్లీ ఉద్యమాలు వస్తాయని అన్నారు. గతంలో ఈ రకమైన ఉద్యమాలు చాలా వచ్చాయని అన్నారు. గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నామని అన్నారు.


సీసీఎస్‌పై ఇటీవలే కీలక ప్రకటన


రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పసిర్థితిలో పాత పింఛన్ విధానాన్ని అమలు చేయడం సాధ్యం కాదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం వాస్తవమే అన్నారు. ప్రత్యామ్నాయ పథకానికి రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. ఇది రెండు నెలల్లో కొలిక్కి వస్తుందని వివరించారు. శనివారం విజయనగరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం నాగులో వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని సీపీఎస్ విధానంలో మార్పులు తీసుకువచ్చినప్పటికీ... ఎవరికీ ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 


ఆర్టీసీ సిబ్బందికి వచ్చే నెల నుంచి కొత్త జీతాలు.. 
వచ్చే మూడు నెలల్లో విద్యా శాఖలో ప్రమోషన్లు పూర్తి చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే ఎంఈఓల నియామకం చేపట్టామన్నారు. పీఆర్సీతో కలిసి జీతాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మరికొద్ది రోజుల్లోనే ఉద్యోగ నియామకాలు చేపడతామన్నారు. ఆర్టీసీ సిబ్బందికి వచ్చే నెల నుంచి కొత్త జీతాలు అమల్లోకి వస్తాయన్నారు. అలాగే రాష్ట్ర విభజన సందర్భంగా రెండు వేల మంది ఉద్యోగుల విషయంలో సమస్య ఏర్పడిందన్నారు. ఈ విషయంపై అనేక సార్లు చర్చలు జరిపామన్నారు. కేంద్రం ఆదేశించిన విధంగా వారికి ఓపీఎస్ అమలు చేయాలా లేకా సీపీఎస్ అమలు చేయాలా అన్నది ఆర్థిక శాఖ ద్వారా కూడా చర్చ జరిగిందన్నారు. ఈ విషయంపై ఈ నెల చివర్లో స్పష్టత వస్తుందని మంత్రి బొత్స తెలిపారు. అయితే ఈ సమావేశంలో మొదటి ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్, సూర్య నారాయణ, కార్యదర్శి జి. అస్కారరావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల అందరినీ దృష్టిలో పెట్టుకొని సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.