వైసీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై భూ కబ్జా కుట్ర కేసు నమోదైంది. నకిలీ మరణ, వారసత్వ పత్రాలతో భూమిని అక్రమంగా పొందడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలున్నాయి.
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
#LandGrabbingCase | భూమి యజమానిపై నకిలీ డెత్ సర్టిఫికేట్ సృష్టించి, భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించిన కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య, కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

- వైసీపీ నేత తమ్మినేని సీతారాం కుటుంబంపై భూ కబ్జా కేసు నమోదైంది.
- నకిలీ మరణ, వారసత్వ పత్రాలతో కోట్ల విలువైన భూమిని కబ్జా చేయబోయారు.
- ఎనిమిది మంది అరెస్టు; తమ్మినేని కుటుంబ సభ్యులపై విచారణ కొనసాగుతోంది.
- అసలు యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Land Grabbing Case | శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. వైసీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై భూ కబ్జా కుట్ర కేసు నమోదైంది. భూమి అసలు యజమాని బతికుండగానే, అతను చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాన్ని (Fake Death Certificate) సృష్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ నకిలీ సర్టిఫికెట్ ఆధారంగా తప్పుడు వారసత్వ ధృవీకరణ పత్రాలను (ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్) రూపొందించి, ఆ భూమిపై అక్రమంగా హక్కులు పొందేందుకు ప్రయత్నించారని తేలింది. దీనిపై అసలు యజమాని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
A6గా తమ్మినేని సీతారాం.. A5గా కుమారుడు, A7గా భార్య
ఈ భూ కబ్జా కుట్ర కేసులో పోలీసులు నిందితుల జాబితాను సిద్ధం చేశారు. A1 అడబాల రజనీ, A2సతీష్ కుమార్, A3 సలిపిల్లి లక్ష్మణరావు, A8 ముదాడ్ల ఉపేంద్ర కుమార్, A9 జెగురిపాటి ఉపేంద్ర రావు, A10 మామిడి గోపాలకృష్ణ , A11 సాంబాన సాంబశివరావు, A12 కూన పెద్దిరాజు మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం A4 త్రినాథ్, A5 తమ్మినేని చిరంజీవి నాగ్, A6 తమ్మినేని సీతారాం, A7 తమ్మినేని వాణి, A13 బొడ్డేపల్లి అరుణ (సబ్‌రిజిస్ట్రార్)పై దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే వీరిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నకిలీ పత్రాల సృష్టి, భూ కబ్జా యత్నంలో వీరి పాత్రపై పోలీసులు నిఘా పెట్టారు.
శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి ఈ భూ కబ్జా కుట్రకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. శ్రీకాకుళంలోని బలగ పరిధి సర్వే నంబర్ 35/13లో ఉన్న సుమారు 3 నుండి 4 కోట్ల విలువైన భూమిని కబ్జా చేయడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. ఈ వివాదాస్పద భూమికి సంబంధించి 1992 నుండి 1998 మధ్య కాలంలో కొన్ని లావాదేవీలు జరిగాయని వివరించారు.
ఈ కబ్జా ప్రక్రియలో భాగంగా అంధవరపు గోవిందరాజులు అనే వ్యక్తి బతికి ఉండగానే, ఆయన చనిపోయినట్లు ఒక తప్పుడు డెత్ సర్టిఫికెట్ సృష్టించారని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఒడిశాలోని జయపురకు చెందిన అడబాల రజనీ అనే మహిళను, గోవిందరాజులు కుమార్తె 'అంధవరపు రజనీ'గా చూపించారు. ఆ నకిలీ వారసత్వ పత్రాల ఆధారంగా ఆ భూమిని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడైన తమ్మినేని చిరంజీవి నాగ్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు.
ఈ స్థలానికి ప్రహరీ గోడ నిర్మించేందుకు నిందితులు ప్రయత్నించగా, అసలు యజమాని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమాలన్నీ వెలుగులోకి వచ్చాయి. నిందితులు నకిలీ పత్రాలు సృష్టించడం, తప్పుడు వారసత్వాన్ని అల్లడం, ఫోర్జరీ పత్రాలతో అక్రమ రిజిష్ట్రేషన్‌కు పాల్పడ్డారని పోలీసుల విచారణలో స్పష్టమయ్యాయని ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి వెల్లడించారు.
ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా ఎస్పీ స్పందిస్తూ కీలక వివరాలను వెల్లడించారు. ఈ అక్రమాలకు సంబంధం ఉన్న 8 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. నిందితులుగా ఉన్న తమ్మినేని కుటుంబ సభ్యులపై సమగ్రంగా దర్యాప్తు జరిపి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు.
Frequently Asked Questions
భూ కబ్జా కుట్ర కేసు ఎవరిపై నమోదైంది?
ఈ భూ కబ్జా యత్నం ఎలా జరిగింది?
అసలు యజమాని బతికుండగానే చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రం సృష్టించారు. దాని ఆధారంగా తప్పుడు వారసత్వ ధృవీకరణ పత్రాలు రూపొందించి, తమ్మినేని కుమారుడి పేరుపై భూమిని రిజిస్ట్రేషన్ చేయించారు.
ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న ప్రధాన వ్యక్తులు ఎవరు?
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం (A6), ఆయన కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్ (A5), భార్య తమ్మినేని వాణి (A7), సబ్‌రిజిస్ట్రార్ బొడ్డేపల్లి అరుణ (A13)లపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ కేసులో ఎంతమందిని అరెస్ట్ చేశారు?
ఈ భూ కబ్జా కుట్ర కేసులో ఇప్పటివరకు 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ్మినేని కుటుంబ సభ్యులపై దర్యాప్తు కొనసాగుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















