Srikakulam Stampede News: శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గలో జరిగిన ప్రమాదంపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా మీడియా మాట్లాడారు. ఇలాంటి దుర్ఘటన ఊహించలేదని అన్నారు. గుడి ఏర్పాటు చేసిన తర్వాత ఇంత జనం ఎప్పుడూ రాలేదని అంటున్నారు. ఇంత మంది వస్తారని తెలిసి ఉంటే కచ్చితంగా సరైన జాగ్రత్తలు తీసుకునే వాళ్లని పోలీసులకు, ప్రభుత్వానికి సమాచారం ఇచ్చే వాళ్లమని చెప్పారు. గతంలో జనం పెద్దగా రానందున ఈసారి అలానే ఉంటుందని అనుకున్నట్టు పేర్కొన్నారు. చాలా దురదృష్టకరమైన ఘటన జరిగిందని అన్నారు.
హరిముకుంద్ పండా ఏమన్నారంటే.... " ఇంతమంది భక్తులు వస్తారని నేను కూడా ఊహించలేదు.. ఆలయానికి రెండు వేలమంది భక్తులు వస్తుంటారు. భక్తులకు ప్రసాద వితరణ చేసి పంపిస్తాను.. ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఇంతమంది వస్తారని తెలియక పోలీసులకు సమాచారం ఇవ్వలేదు."
ఆలయంలోనే ఉన్న హరిముకుంద్ పండాతో కలెక్టర్, ఎస్పీ మాట్లాడారు. అక్కడి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. పోలీసు పహారాలో ఆలయం ఆవరణలోనే హరిముకుంద్ పండా ఉన్నారు. ఆయనతో మంత్రి అచ్చెన్నాయుడు కూడా మాట్లాడారు.
కాశీబుగ్గ ఆలయం తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈదురి చిన్నమ్మి, టెక్కలిలోని రామేశ్వరం గ్రామం
రాపాక విజయ, టెక్కలిలోని పిట్టలసారి గ్రామం
మురిపింటి నీలమ్మ, వజ్రపుకొత్తూరులోని దుక్కవానిపేట గ్రామం
దువ్వు రాజేశ్వరి మందసలోని బెలుపటియా గ్రామం
చిన్ని యోశోదమ్మ, నందిగాంలో శివారంపురం గ్రామం రూప, మందసలోని గుడ్డిభద్ర గ్రామం
డొక్కర అమ్ముడమ్మ, పలాస
బోర బృందావతి, మందస