Jana Sena leader allegations: పోర్ట్ స్టేడియం లీజు వ్యవహారంలో భారీ కుంభకోణం - జనసేన తీవ్ర ఆరోపణలు
Visakhapatnam Port Stadium scam: విశాఖ పోర్ట్ స్టేడియం లీజు వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందని జనసేన ఆరోపించింది. అక్రమ చెల్లింపులపై సిబిఐ విచారణకు ఆ పార్టీ నేత మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు

Jana Sena demands CBI probe: విశాఖపట్నం నగర నడిబొడ్డున ఉన్న పోర్ట్ స్టేడియం లీజు వ్యవహారం ఇప్పుడు పెను రాజకీయ దుమారానికి దారితీసింది. స్టేడియం నిర్వహించలేక మధ్యలోనే చేతులెత్తేసిన విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ సంస్థకు సుమారు 40 కోట్ల రూపాయల పరిహారం కట్టబెట్టేందుకు పోర్టు అధికారులు సిద్ధమవడంపై జనసేన నేత పీతల మూర్తి యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సంస్థ యజమాని బొడ్డేటి కాశీ విశ్వనాథం, అతనికి సహకరిస్తున్న పోర్టు అధికారులపై తక్షణమే సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
లీజుకు తీసుకుని ఉల్లంఘనలకు పాల్పడిన విశ్వనాథ్ స్పోర్ట్స్
విశ్వనాథ్ స్పోర్ట్స్ సంస్థ 2023లో పదేళ్ల కాలానికి స్టేడియంను లీజుకు తీసుకున్నప్పటికీ, అనేక ఉల్లంఘనలకు పాల్పడిందని మూర్తి యాదవ్ ఆరోపించారు. నిబంధనలను అతిక్రమించి సబ్ లీజులకు ఇవ్వడం, అక్రమ కట్టడాలు చేపట్టడం వల్ల పోర్టు యాజమాన్యం గతంలోనే లీజును రద్దు చేసి స్టేడియంను స్వాధీనం చేసుకుంది. అయితే, ఇప్పుడు థర్డ్ పార్టీ అసెస్మెంట్ పేరుతో సదరు సంస్థకు నష్టపరిహారం చెల్లించేందుకు తెరవెనుక భారీ పైరవీలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. పోర్టుకు రావాల్సిన బకాయిలను వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు, ఒక ప్రైవేటు వ్యక్తికి కోట్ల రూపాయలు దోచిపెట్టడం వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందని విమర్శించారు.
సింహాచలం దేవస్థానానికి చెందిన భూమిలో నిర్మాణాలు
పోర్ట్ స్టేడియం వెనుక సింహాచలం దేవస్థానానికి చెందిన వివాదాస్పద భూమిలో నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారని, దీనికి పోర్టు అధికారులు అక్రమంగా అనుమతులు ఇప్పించారని మూర్తి యాదవ్ వెల్లడించారు. ఎటువంటి నిరభ్యంతర పత్రాలు లేకుండానే చేపట్టిన ఈ నిర్మాణం పేరుతో కొనుగోలుదారుల నుండి కోట్లాది రూపాయల అడ్వాన్సులు వసూలు చేసి ఇప్పుడు సమాధానం చెప్పడం లేదన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో అప్పటి నేతల సిఫార్సులతోనే ఈ అక్రమాలు జరిగాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
విశాఖ పోర్ట్ అథారిటీ నిధుల ఎగవేత
విశాఖ పోర్ట్ అథారిటీ మహా విశాఖ నగరపాలక సంస్థకు 600 కోట్ల రూపాయలకు పైగా బకాయి పడిందని, నిధులు లేవన్న సాకుతో ప్రజలకు ఉపయోగపడే ఆసుపత్రి, విద్యాసంస్థలను మూసివేసిందని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వ సంస్థలకు చెల్లించాల్సిన నిధులను ఎగవేస్తూ, ఒక వివాదాస్పద ప్రైవేటు సంస్థకు 40 కోట్ల రూపాయల పరిహారాన్ని ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. ఒకవైపు నిధుల కొరతతో ప్రజల సేవలను కుదిస్తూ, మరోవైపు అవినీతి అక్రమాలకు పాల్పడటం బహిరంగ దోపిడీయేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇన్ని ఆరోపణలున్న సంస్థకు విజయవాడలో భవాని ఐల్యాండ్ కేటాయింపు
విశాఖలో ప్రాజెక్టులను సగంలోనే వదిలేసి, ప్రభుత్వ భూముల కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న విశ్వనాథ్ సంస్థకు విజయవాడలోని అత్యంత విలువైన భవాని ఐలాండ్ టూరిజం ప్రాజెక్టును ఎలా కట్టబెడతారని మూర్తి యాదవ్ ప్రశ్నించారు. ఒక రకంగా దివాలా తీసిన సంస్థకు రాష్ట్ర రాజధానిలోని కీలక ప్రాజెక్టును అప్పగించడం నిబంధనలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. అధికారంలో ఉన్న పార్టీల నేతలను ప్రలోభపెట్టి పైరవీలు చేసే ఇటువంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవాని ఐలాండ్ లీజును వెంటనే రద్దు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు.
పోర్ట్ స్టేడియం లీజు రద్దు నుండి అక్రమ పరిహారం చెల్లింపు ప్రయత్నాల వరకు సాగుతున్న ఈ వ్యవహారం విశాఖలో హాట్ టాపిక్ గా మారింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మ, బిఐ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని లోతైన విచారణ జరిపితేనే అసలు నిజాలు బయటపడతాయని జనసేన నేత స్పష్టం చేశారు. అక్రమంగా దోచుకున్న ప్రజా ధనాన్ని కాపాడే వరకు తమ పోరాటం ఆపబోమని ఆయన హెచ్చరించారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















