విజయనగరం: ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చీపురుపల్లిలో వెన్నుపోటు దినం ర్యాలీలో పాల్గొన్న బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ర్యాలీ అనంతరం సభలో ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వాహనం మీద ఎక్కి మాట్లాడుతుండగా.. ఆయన చాలా నీరసంగా కనిపించారు. పక్కన ఉన్న నేతలు నీళ్లు తాగుతారా అని అడిగేలోపు కళ్లు తిరిగి పడిపోయారు.  అస్వస్థతకు గురైన బొత్స సత్యనారాయణను పార్టీ నేతలు, అనుచరులు  హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 

ఆందోళన అవసరం లేదన్న పార్టీ నేతలు

శాసనమండలిలో వైసీపీపక్షనేత బొత్స సత్యనారాయణ కళ్లు తిరిగి పడిపోవడంతో పార్టీ నేతలు, ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో సొమ్మసిల్లిపోయారని, ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం బొత్స సత్యనారాయణ ఇంటికి చేరుకుని క్షేమంగా కనిపించారు. పార్టీ నేతల సమాచారం మేరకు ఆయన సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ కు ప్రయాణం కానున్నారు.

వైసీపీ వెన్నుపోటు దినోత్సవం నిరసన, ఆందోళనలు

అమరావతి:  మాజీ సీఎం వైఎస్ జగన్నేడు వైసిపి వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వెన్నుపోటు దినోత్సవంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం సమయంలో మాజీ సీఎం జగన్ తాడేపల్లి నుంచి బెంగుళూరు వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో 175 స్థానాలకుగానూ వైసీపీ 11 స్థానాల్లో నెగ్గింది. కూటమి నేతలు 164 నియోజకవర్గాల్లో విజయం సాధించారు. కాగా,  మంగళవారం నాడు తెనాలిలో పర్యటించిన జగన్ ఇటీవల పోలీసుల దాడిలో గాయపడిన బాధితుడు జాన్ విక్టర్ ను పరామర్శించారు. నడిరోడ్డు మీద యువకులు, వ్యక్తులను దారుణంగా కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని జగన్ ప్రశ్నించారు.