రిషికొండలో నిబంధనలకు విరుద్ధంగా సీఎం క్యాంప్ కార్యాలయ నిర్మాణం జరుగుతోందని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి కట్టడాలు నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ పర్యావరణవేత్త లింగమనేని శివారం ప్రసాద్‌ పిల్ వేశారు. 


కోస్టాల్ రెగ్యులేటరీ జోన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా వైజాగ్‌లోని రిషికొండపై నిర్మాణాలు జరుగుతున్నాయని పిల్‌లో పేర్కొన్నారు. అది సీఎం కాంప్ కార్యాలయంగా చెబుతున్నారని అందులో వివరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48/A ఉల్లంఘనలకు పాల్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలను వెంటనే నిలువరించాలని కోరారు. 


కోస్టల్ రెగ్యులేటరీ జోన్‌కు సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో కేసు విచారణ జరుగుతుండగా నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించారని పిటిషన్‌లో పేర్కొన్నారు ప్రముఖ పర్యావరణ వేత్త శివరాం ప్రసాద్.


నిబంధనలు, ఉన్నత స్థాయి కోర్టుల ఆదేశాలు పక్కన పెట్టి ఆఫీస్‌లను తరలించే జీవోను తీసుకొచ్చారని కోర్టుకు వివరించారు. రిషికొండలో సీఎం క్యాంపు కార్యాలయం, విశాఖలో సీనియర్ అధికారుల కార్యాలయాల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్‌ 11న జీవో రిలీజ్ చేసిందని వెల్లడించారు. జీవో 2015ను వెంటనే రద్దు చేయాలనీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు శివరాం ప్రసాద్.


NGT, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిషికొండపై రిసార్ట్ నిర్మాణం పై దాఖలైన కేసులు పరిష్కారం అయ్యే వరకు రిషి కొండపై నిర్మాణాలు, ప్రారంభ కార్యక్రమాలు జరగకుండా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌తో పాటు కార్యాలయాల తరలింపుపై జిఎడి ఇచ్చిన జీఓ, పలు పత్రికల్లో వచ్చిన వార్తలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఇచ్చిన ఆదేశాల కాపీలు జత చేశారు. గతంలో జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల కాపీని కూడా యాడ్ చేశారు.