Hyper Aadi Serious Comments: పాపులారిటీ కోసం ప్రతి ఒక్కరూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను విమర్శిస్తున్నారని, మిగతా హీరోల్లా ఆయన డబ్బుల కోసం సినిమాలు చేయడం లేదని, కౌలు రైతుల కష్టాలు తీర్చేందుకు సినిమాలు ఒప్పుకున్న హీరో అని నటుడు, కమెడియన్ హైపర్ ఆది అన్నారు.  శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించిన యువశక్తి బహిరంగ సభలో ఏపీ మంత్రులపై, పవన్ ను తిట్టే వారిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ స్టేజీ మీద ఉన్న నాయకులు అందరి కంటే అతి తక్కువ ఆస్తులు కలిగి ఉన్న నేత పవన్ కళ్యాణ్ అని, ఎందుకంటే ఆయన డబ్బులు పెంచుకుంటే పోయే మనిషి కాదని, పంచుకుంటూ పోయే మనస్తత్వం జనసేనాని సొంతమన్నారు. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచే కమెడియన్ హైపర్ ఆది తొలిసారి జనసేన పార్టీ కార్యక్రమంలో పాల్గొని ఉద్వేగభరితంగా మాట్లాడాడు. డబ్బు మీద ఆశలేని వ్యక్తి పాలిటిక్స్ లోకి వస్తే, ప్రతి రూపాయి ప్రజలకు ఖర్చు చేస్తాడన్నారు. అలాంటి వ్యక్తి పవన్ గురించి ప్రెస్ మీట్లు పెట్టి బూతులు తిట్టడం సరికాదన్నారు.


పవన్ ను తిట్టే శాఖ పెట్టుకోండి.. హైపర్ ఆది సెటైర్లు
ప్రజల సమస్యలు తీర్చడాన్ని పక్కనపెట్టి, ఏపీ మంత్రులు జనసేనాని పవన్ కళ్యాణ్ ను తిట్టడాన్నే పనిగా పెట్టుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు హైపర్ ఆది. పవన్ కళ్యాణ్‌ను తిట్టే శాఖ అని ఒకటి పెట్టుకుని, ఇక  కంటిన్యూగా పవన్‌ను తిట్టండి. లేకపోతే ఆయా శాఖలకు మంత్రులుగా ఉండి శాఖల పరువు తీస్తున్నారంటూ మండిపడ్డాడు. ఓ 10 నిమిషాలు తమ శాఖ గురించి మాట్లాడమని చెబితే కచ్చితంగా 10 సెకన్లలోపే దొరికిపోతారని మాకు తెలుసు. వారాహి వాహనం యాత్రను నిలిపివేస్తారా, పవన్ కళ్యాణ్ కు తిక్కరేగితే పాదయాత్ర చేస్తాడు. మీరు కాశీ యాత్ర చేయాల్సిందే నని ఫిక్స్ కావాలంటూ సెటైర్లు వేశాడు. జనాల కోసం ఉన్నాను కనుక జనసేనానిగా ఉన్నాడు, విసిగిస్తే వీరమల్లు బయటకు వస్తాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేవలం ప్రేమకు మాత్రమే లొంగుతాడు, కానీ డబ్బుకు కాదని ప్యాకేజీ స్టార్ అనే విమర్శలను తిప్పికొట్టాడు.


దత్త పుత్రుడు కాదు అంజనీపుత్రుడు..
ఏ నోటితో అయితే దత్త పుత్రుడు అని అన్నారో అదే నోటితే అంజనీ పుత్రుడు అనిపించుకుని నిరూపిస్తాడు పవన్. ప్రపంచంలో ప్రతి ఒక్కడూ పవన్ కళ్యాణ్ ను మాటలు అనేసి పాపులర్ అయిపోదామని చూస్తున్నారు. కానీ జనసేన పార్టీతో పవన్ కొట్టే దెబ్బకు మీ అబ్బ గుర్తుకురావడం ఖాయం. మీరేమే వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తారు. కానీ పార్టీని నడిపేందుకు పవన్ సినిమాలు చేసుకోకూడదా అని ప్రశ్నించాడు హైపర్ ఆది. టేబుల్ మీద భారతదేశం బొమ్మ పెట్టుకుని టేబుల్ కింద లంచాలు తీసుకునే మీది నిలకడలేదని రాజకీయం. ప్రజలకు ఏం చేశారో డెవలప్ మెంట్ గురించి మాట్లాడకుండా పవన్ ను తిట్టే మీది నిలకడలేని రాజకీయం. మీ ఇంట్లో పెళ్లికి ఆయన వస్తే చాలనుకునే మీరు ఆయనను తిడుతుంటే పవన్ ఫ్యాన్స్‌కు, జనసేన అభిమానులకు కచ్చితంగా కోపం వస్తుందన్నారు.