CM Jagan: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమ, మంగళ వారాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో.. రేపు అంటే మంగళవారం రోజు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలను సందర్శించనున్నారు. వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు. వరద సహాయ, పునరావాస చర్యలు అమలు చేసిన తీరుపై స్వయంగా బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకోనున్నారు. గోదావరి వరదలతో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో ఇటీవల పలు ప్రాంతాలు వరద ముంపుకు గురైన విషయం అందరకీ తెలిసిందే. అయితే సహజంగా అలాంటి సమయంలో సీఎం ఆ ప్రాంతాల్లో పర్యటించడం పరిపాటి. గత ప్రభుత్వాల్లో అలానే చేసేవారు. అలా చేస్తే అధికార యంత్రాంగం అంతా సీఎం వెంట ఉంటుందని.. అప్పుడు బాధితులకు సహాయ కార్యక్రమాలు అందించడానికి ఇబ్బంది అవుతుందని వైసీపీ నేతలు, ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  


మంపు ప్రాంతాల్లో పర్యటించడం, ఫొటో సెషన్ వల్ల ఒరిగేది ఏమీ ఉండదని... బాధితులందరికీ సాయం అందాలంటే తను ఆదేశాలు ఇస్తే సరిపోతుందని అంటున్నారు. ఈక్రమంలోనే తొలుత సహాయ కార్యక్రమాల కోసం అవసరమైన నిధులను విడుదల చేశారని... బాధితుల తరలింపు పునరావాస శిబిరాల ఏర్పాటు, ఆహారం, మంచినీరు, మందులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. తద్వారా ఉన్నతాధికారులు, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల సహకారంతో సాయం అందలేదన్న అపవాదు రాకుండా చూసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి కుదిట పడిందని.. శిబిరాల నుంచి ప్రజలు ఇళ్లకు వెళ్లిపోయారని తెలుస్తోంది. అలాగే అన్ని ప్రాంతాలకు రాకపోకలను కూడా పునరుద్ధరించారు. ఈక్రమంలోనే ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో పర్యటించి సాయం అందిన తీరు గురించి ప్రజలతో స్వయంగా మాట్లడడానికి రెండు రోజుల పర్యటన తలపెట్టారు. 


బాధిత కుటుంబాలతో సమావేశం కాబోతున్న ఏపీ సీఎం జగన్


సోమవారం ఉదయం 9.30 గంటలకు సీఎం వైస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలు దేరారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కోతులగట్టు చేరుకుంటారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడతారు. ఆపై కూనవరం బస్టాండు సెంటర్ లో కూనవరం, వీఆర్ పురం మండలాల వరద బాధితులతో సమావేశం అవుతారు. అనంతరం ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గొమ్ముగూడెం చేరుకుంటారు. అక్కడ వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను పరిశీలిస్తారు. ఆ తర్వాత వరద బాధిత కుటుంబాలతో సమావేశం అవుతారు. సాయంత్రానికి రాజమహేంద్రవరం ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ కు చేరుకుని అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. మంగళవారం ఉదయం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజాపులంక చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడి ఆ తర్వాత తానేలంక రామాలయంపేటకు వెళ్తారు. అక్కడ వరద బాధితులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత అయినవిల్లి మండలం తోటరాముడివారిపేట, కొండుకుదురు చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం తరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.