విజయనగరం జిల్లాను ప్రగతి పథాన పరుగులు పెట్టించే అత్యంత ప్రతిష్టాత్మకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటుగా తారకరామ తీర్ధసాగర్ జలాశయ ప్రాజెక్టు పెండింగ్ పనులకు, చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. వీటికి సంబంధించి భోగాపురం సమీపంలోని సవరవల్లి వద్ద శిలా ఫలకాల ఆవిష్కరణ అనంతరం, అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు.
ముఖ్యమంత్రి జగన్ పర్యటన కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎం పర్యటనల సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపి బెల్లాన చంద్ర శేఖర్, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు సిఎం జగన్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లా ఎస్‌పీ దీపిక ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు
2,203 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం
భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని జి.ఎం.ఆర్. గ్రూప్ 2,203 ఎకరాల్లో నిర్మించనుంది. ఇందులో రూ.4,592 కోట్ల వ్యయంతో ఎయిర్‌పోర్టు తొలిదశ నిర్మాణాన్ని ఆ సంస్థ చేపట్టనుంది. పనులు ప్రారంభించిన నాటి నుంచి గరిష్టంగా మూడేళ్ల వ్యవధిలో నిర్మాణాన్ని పూర్తిచేసి ఎయిర్‌పోర్టు కార్యకలాపాలను ఆ సంస్థ ప్రారంభిస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానం (పిపిపి)లో జి.ఎం.ఆర్. విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ దీనిని నిర్మిస్తోంది. తొలిదశలో ఏటా 60 లక్షల మంది(ఆరు మిలియన్ల) ప్రయాణీకులు ఈ ఎయిర్‌పోర్టు ద్వారా ప్రయాణాలు సాగించేలా డిజైన్ చేశారు. ఆ తర్వాతి దశల్లో ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా ప్రతి ఏటా 4 కోట్ల(40 మిలియన్ల) ప్రయాణీకులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తారు.
ఎయిర్‌పోర్టులో ఎంతో కీలకమైన రన్‌వే 3.8 కిలోమీటర్ల పొడవుతో ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 5 వేల చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించనున్న దేశీయ, అంతర్జాతీయ కార్గో టెర్మినల్ ఈ ఎయిర్‌పోర్టుకు అదనపు బలంగా చెప్పవచ్చు. ఈ కార్గో టెర్మినల్ ద్వారా మన రాష్ట్రంతోపాటు సరిహద్దున ఉన్న రాష్ట్రాల నుంచి వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఎగుమతులు, దిగుమతుల ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. విమానాశ్రయం పూర్తయితే ప్రత్యక్షంగా లక్ష మందికి, పరోక్షంగా 5 లక్షలమందికి ఉపాధి లభిస్తుందని అంచనా.
వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు ఊతమిచ్చే తారకరామ ప్రాజెక్టు
జిల్లాలో వ్యవసాయాన్ని వృద్ది చేయడమే కాకుండా, పారిశ్రామిక అభివృద్దికి దోహదపడుతుంది తారకరామ తీర్ధసాగర్ ప్రాజెక్టు. సుమారు 24,710 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు పెండింగ్ పనులను రూ.194.40 కోట్లతో పూర్తి చేసేందుకు, ముఖ్యమంత్రి నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కొత్తగా 16,538 ఎకరాలకు సాగునీరు, 8,172 ఎకరాలకు స్థిరీకరణ జరుగుతుంది. ప్రాజెక్టు ద్వారా విజయనగరం పట్టణ ప్రజలకు 0.48 టిఎంసిల త్రాగునీరు అందుతుంది. అంతేకాకుండా భోగాపురం విమానాశ్రయానికి, నిర్వాసిత కాలనీలకు రోజుకు 5 ఎంఎల్‌డిల నీటిని సరఫరా చేస్తారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు సైతం ఈ ప్రాజెక్టు నుంచే నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మత్స్యకారులకు దిక్సూచి... ఫిష్ ల్యాండింగ్ సెంటర్
చింతపల్లివద్ద నిర్మించే ఫిష్ ల్యాండింగ్ సెంటర్ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపనుంది. సుమారు రూ.23.73 కోట్లతో, ఆరు ఎకరాల స్థలంలో నిర్మించే ఫిష్ ల్యాండింగ్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి నేడు ప్రారంభిస్తారు. జిల్లాలో విస్తరించి ఉన్న తీరప్రాంతంలోని 4వేల మత్స్యకార కుటుంబాలతోపాటు శ్రీకాకుళం, విశాఖ జిల్లాల మత్స్య కారులకు కూడా ఈ ల్యాండింగ్ సెంటర్ ఎంతో మేలు చేకూర్చుతుంది. ప్రదానంగా ఈ ప్రాంతంలోని నైపుణ్యం ఉన్న మత్స్యకారులు, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల తీర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. సముద్రంలోకి ప్రవేశించే సమయంలో కెరటాల వల్ల సంభవించే ప్రమాదాలు నివారింపబడి, గంగపుత్రుల ప్రాణాలకు రక్షణ లభిస్తుంది. ఈ ప్రాంతం పర్యాటకంగా కూడా అభివృద్ది చెందుతుంది.
సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు భోగాపురం మండలం ఎ.రావివలస గ్రామం వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 10.25 గంటలకు సవరివిల్లి వద్ద ఏర్పాటు చేసిన జీఎంఆర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌కు చేరుకొని, ఆ సెంటర్‌ను సందర్శిస్తారు. భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం, చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం, తారకరామతీర్ధ సాగర్ ప్రాజెక్ట్ మిగులు పనులకు సంబంధించిన శిలాఫలకాలను అక్కడే ఆవిష్కరిస్తారు. 10.55 గంటలకు సమీపంలోని బహిరంగసభ వేదిక వద్దకు చేరుకొని ప్రసంగిస్తారు. సభ అనంతరం 1.20 గంటలకు అక్కడి నుంచి విశాఖ పర్యటనకు బయలుదేరుతారు.