BJP Vishnu : ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎంచుకోవడం రాష్ట్ర ప్రజల దురదృష్టమని ఏపీ బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ను సీఎంగా ఎన్నుకోవడం వల్ల జీతాలు కూడా సరైన సమయానికి ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందన్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్..  రాష్ట్ర ఆదాయ, వ్యయాలపై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్ర పరిపాలన ఎలా ఉందో గవర్నర్ చూడాలని సూచించారు. అన్నింటిలోనూ నంబర్ వన్ అని ప్రచారం చేసుకుంటున్నారని... అప్పులు చేయడంలో, దోచుకోవడంలో, బ్లాక్ మనీని దాయడంలో కూడా నెంబర్ వన్ అని విష్ణుకుమార్ రాజు విమర్శలు గుప్పించారు. 


విశాఖలో రుషికొండను పూర్తిగా ధ్వంసం చేసిన అరాచక సీఎం జగన్ అని విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు.  స్వీట్ గా మాట్లాడి కేంద్రంతో వినయంగా అప్పులు  తేవడంలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దిట్ట అని.. అప్పులు బాగా చేసినందుకు నా వంతు కంగ్రాట్స్ తెలుపుతున్ననని సెటైర్ వేశారు. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుతో పాటు ఎన్నో  అరాచకాలు చేసిన ఎమ్మెల్సీని బెయిల్ పై విడుదల చేసి ఘనంగా స్వాగతం పలుకుతారా అని నిలదీశారు. రాష్ట్రంలో హంతకుడుకి ర్యాలీలు, సన్మానాలు చేస్తారా సిగ్గు ఉందా వైసీపీకి అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.  జగన్మోహన్ రెడ్డి ఆత్మసాక్షి చేసుకోండి నేరస్తులను ప్రోత్సహం చేయడం కరెక్ట్ కాదని సలహా ఇచ్చారు. 


ఏపీలో జగనన్న కాలనీల పేరుతో మాయ చేస్తున్నారని రూ. 35 వేలు కడితే ఇస్తాం అంటున్నారని.. కడితే మీరు ఇస్తారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో  మంత్రుల పేర్లు తెలిసేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.  జగన్మోహన్ రెడ్డి మంత్రులను కూడా ఉంచరని ఎద్దేవా చేశారు. డ్వాక్రా ఏ కార్యక్రమానికి అయినా మాపై ఒత్తిడి తెస్తున్నారని మహిళలు గోల పెడుతున్నారన్నారు. విపరీతమైన అవినీతి రాష్ట్రంలో పెరిగిందన్నారు. ఇక నుంచి అవినీతికి దూరంగా ఉండాలని మంత్రులకు జగన్ చేసిన సూచనపైనా విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. లంచం ఇవ్వడం నేరం లంచం తీసుకోవడం నేరం అని సీఎం చెప్పాలన్నారు.  సీఎం పరిపాలన విధానం బాగోలేదన్నారు.  


జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార వాహనం వారాహి రంగుపై వైఎస్ఆర్‌సీపీ నేతలు చేస్తున్న విమర్శలను విష్ణుకుమార్ రాజు తిప్పికొట్టారు.  వారాహి కలర్ వల్ల అపోహ పడి అడ్డుకోవడం అని చెపుతున్నారని.. వారాహి రంగు సరైన రంగు అని, ఆ బండి ని ఎవరు అడ్డుకోలేరు ఇది బీజేపీ మాట అని స్పష్టం చేశారు.  అవినీతి డబ్బు ,కండబలం ,పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని గెలుస్తామని ధీమాగా చెపుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో  తప్పనిసరిగా వైసీపీ అరాచక విధానాలను తప్పు పడతాం, 2024 లో ప్రభుత్వాన్ని ప్రజలు బయటకు పంపిస్తారన్నారు.