Vizag Software Thief: పగలు సాప్ట్‌వేర్.. నైట్ హార్డ్‌వేర్.. BMWలో వచ్చి ఇళ్లను దోచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..
Vizag Software Thief: అతనో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. పగలు కోడింగ్ రాస్తాడు.. నైట్ ఇళ్లను దోచేస్తాడు.. BMW కారులో వచ్చి దొంగతనాలు చేసే Sunny the Thief ఇంట్రస్టింగ్ స్టోరీ ఇది.

Vizag Software Thief: Sunny.. హైదరాబాద్‌లో ఫుల్‌టైమ్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్.. కానీ మనోడికి సైడ్ ఇన్‌కమ్ కోసం పార్ట్‌టైమ్ వేరే జాబ్ ఉంది. వీక్‌డేస్‌లో హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ జాబ్ చేసే సన్నీ.. వీకెండ్స్‌లో వైజాగ్ లో హార్డ్‌వేర్ జాబ్ చేస్తున్నాడు. అంటే తన దగ్గర ఉన్న టూల్స్‌తో ఇళ్లు బద్దలుకొట్టి బంగారం,వెండి, డబ్బలు దోచేస్తుంటాడు. ఈ మధ్య కాలంలో ఈ పార్ట్‌టైమ్ పనులు ఎక్కువ కావడంతో వైజాగ్ పోలీసులు అతని ఆట కట్టించారు.
సాప్ట్‌వేర్ మహేష్.. అలియాస్ సన్నీ ది దొంగ:

పై ఫోటోలో BMW కారు ముందు నించుని ఫోజులు కొడుతున్న వ్యక్తే మన సాఫ్ట్‌వేర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ "అచ్చి మహేష్ రెడ్డి" అలియాస్ "సన్నీ ది దొంగ".పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఐటీ ఉద్యోగి ఇతను. దాని మీద రాసిన క్యాప్షన్ చూశారుగా.. డబ్బుంటే నువ్వు ఏం చేశావ్ అని ఎవరూ అడగరు అనే కోట్‌తో సోషల్‌మీడియాలో పెట్టుకున్నాడు. అందుకే డబ్బు కోసం దొంగతనాలు మొదలుపెట్టాడు. వృత్తి సాఫ్ట్‌వేర్ కోడింగ్ రాయడం.. కానీ ప్రవృత్తి అర్థరాత్రులు దొంగతనాలు చేయడం.. 15 ఏళ్లకే జువెనైల్ హోమ్ చూసిన సన్నీ, ఆ తర్వాత ఏపీలో 60కి పైగా చోరీ కేసుల్లో నిందితుడిగా మారాడు. హైదరాబాద్‌లో లగ్జరీ లైఫ్, విశాఖలో నైట్ డ్యూటీ… ఇదే అతని ఫార్ములా. కానీ చివరకు పోలీసుల ప్లానింగ్ ముందు సన్నీ ప్లాన్ ఫెయిల్ అయింది.
గాజువాకలో దొంగతనంతో పోలీసుల టార్గెట్
2025 అక్టోబర్ 12న గాజువాకలో శివరామకృష్ణ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం చేశాడు. 17తులాల బంగారంతో పాటు వెండిని కొట్టేశాడు. ఈ దొంగతనం ఆ ఇంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే పోలీసులకు దొరక్కుండా నెంబర్ ప్లేట్ లేని స్కూటీలు వాడటం, కళ్లు తప్ప ఏమీ కనిపించకుండా శరీరాన్ని కవర్ చేసుకోవడం, ఆధారాలు లేకుండా చేయడంతో పోలీసులకు దొంగను పట్టుకోవడం కష్టమైంది.
సవాలుగా తీసుకున్న సీపీ
అదే సమయంలో పెందుర్తి, గాజువాక, దువ్వాడ, మల్కాపురం, ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలోవరుసగా దొంగతనాలు జరిగాయి.. ఈ కేసుల్లో మొత్తం 1084.94 గ్రాముల బంగారం, 6333.5 గ్రాముల వెండి.. 40,500/- నగదు చోరీకి గురయ్యాయి. దొంగిలించిన బంగారం, వెండి విలువ కోటిరూపాయలకు పైనే ఉంది. వరుస దొంగతనం కేసులు నమోదు అయిన తర్వాత, నేర స్థలాల్లో ఎలాంటి ఆధారాలు వదలకుండా చాలా తెలివిగా దొంగతనాలు చేస్తున్న నిందితుడు విసురుతున్న సవాలును పరిగణనలోకి తీసుకుని, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి,DCP క్రైమ్స్ కె. లతా మాధురి, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ క్రైమ్ బృందాలు, తమ దర్యాప్తులో భాగంగా, సాంకేతికతను నగరంలోని సిసిటివి కెమెరాలను ఉపయోగించి నిందితుడి గురించి పూర్తి వివరాలను సేకరించాయి. వైజాగ్‌లోని మాధవధారలో ఉన్న నిందితుడి ఇంటి నుంచి దొంగతనానికి ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇలా వరుసగా దొంగతనాలు చేసిన డబ్బుతో సన్నీ BMW కారు కూడా కొన్నాడు.. దానితో జల్సాలు చేస్తూ తిరిగేవాడు.. ఇప్పుడు పోలీసులు ఆ కారును స్వాధీనం చేసుకున్నారు.

చిన్నప్పటి నుంచే దొంగతనాలు జల్సాలు
నిందితుడు మహేష్ రెడ్డి చిన్నతనం నుంచే విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. 15 సంవత్సరాల వయస్సులో, విశాఖపట్నం నగరంలోని పీఎం పాలెం ప్రాంతంలో నాలుగు దొంగతనాలు చేస్తూ పట్టుబడి, బాలల సంరక్షణ గృహానికి వెళ్లాడు. విడుదలైన తర్వాత, అతను కాకినాడ టౌన్, సరపావరం, రామచంద్రపురం, ఇంద్రపాలెం మరియు రాజమండ్రి పోలీస్ స్టేషన్ల పరిధిలో 32 దొంగతనాలు చేసి అరెస్టు అయ్యాడు. అతను రాజమండ్రి సెంట్రల్ జైలులో 14 నెలల శిక్ష అనుభవించాడు. మొత్తం మీద, అతనిపై 60కి పైగా గృహ దొంగతనం కేసులు ఉన్నాయి. అతను అప్పుడప్పుడు నగరానికి వచ్చి, దొంగతనాలు చేసి, ఆపై తన విలాసవంతమైన జీవనశైలిని కొనసాగించడానికి తిరిగి హైదరాబాద్‌కు వెళ్ళేవాడు.























