Vangalapudi Anitha : వైసీపీ తప్పుడు విధానాలపై నేను బహిరంగ చర్చకు సిద్ధం అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సవాల్ చేశారు. శనివారం విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అనిత మాట్లాడుతూ... రాష్ట్రంలో సంచులేసుకుని తిరిగే భజన బృందాన్ని చూశానని, వీరు జగనన్నే మా భవిష్యత్ అన్న స్టిక్కర్లు అంటిస్తున్నారని ఎద్దేవా చేశారు. 16 నెలలు చిప్పకూడు తిని మూడున్నరేళ్లుగా బెయిల్ పై ఉన్న వ్యక్తా ఏపీ భవిష్యత్ అని ప్రశ్నించారు. జగన్ మాట తప్పుడు మడం తిప్పడు అన్న వారి నాలుక కోసేయాలని మండిపడ్డారు. వైసీపీ విధానాలపై ఎవరొచ్చినా నేను చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మద్యనిషేధం కాస్త మద్య నియంత్రణగా మారిందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ప్రజలను కోళ్ల ఫారంలో కోళ్ళని చూసినట్టు చూస్తున్నారన్నారు. సొంత బినామీ కంపెనీలు తెచ్చి సొంత బ్రాండ్లు మార్కెట్ లో ముంచెత్తారని విమర్శించారు. ప్రమాణ స్వీకారం రోజునే కరెంట్ రేట్లు తగ్గించేస్తానని ప్రగల్బాలు పలికి ఆరు నెలలకే విద్యుత్ ఛార్జీలు పెంచారని, మూడున్నరేళ్లలో ఏడు సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబే ఏపీకి భవిష్యత్
"వారం రోజుల్లో CPS రద్దు చేస్తామని చెప్పి టీచర్లు రోడ్డెక్కితే వారిని ఎలక్షన్ విధుల్నించి తప్పించారు. 45 సంవత్సరాలకు 3 వేలు పింఛన్ ఇస్తానని అనలేదా? ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, మెట్రో రైల్ ప్రాజెక్టు సంగతి చెప్పలేదా? ఇది మాట తప్పడం, మడమ తిప్పడం కాదా? మీ బిడ్డను అని జగన్ అనడం హాస్యాస్పదం. ఇలాంటి కొడుకు పుట్టాడని తండ్రి వైఎస్.. రోశయ్యతో అన్నారు. ఇలాంటి కొడుకు పుట్టాదేంటిరా అని తల్లి అనుకుంటుంది. ఏ తల్లి అయినా జగన్ లాంటి కొడుకును కోరుకుంటారా? సొంత తల్లిని పట్టించుకోని జగన్ మిగతా తల్లుల గురుంచి పట్టించుకుంటారా? జగన్ ఇంటిలో విజయమ్మ ఒక్క పూట భోజనం చెయ్యలేదు. సొంత బాబాయిని హత్య చేయించి శవం దగ్గర ఏం ఎరగని వారిలా కూర్చున్నారు. ఇలాంటి ఫ్రొఫెషనల్ కిల్లర్ ని ఎవరైనా కొడుకుగా కోరుకుంటారా? కొన్ని రోజులు పోయిన తర్వాత భారతి రెడ్డి ఎవరో తెలియదంటారు. జగన్ ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అని స్టిక్కర్లు వేసుకోండి. ఇలాంటి పనులు జాదుగాళ్లు మాత్రమే చేయగలరని, అందుకే జగన్ ని అలా అనొచ్చు. ఎన్ని విన్యాసాలు చేసినా చంద్రబాబును అధికారంలోకి రాకుండా అడ్డుకోలేరు. చంద్రబాబే ఈ రాష్ట్రానికి భవిష్యత్ అని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. " - వంగలపూడి అనిత
మా భవిష్యత్తు కాదు మా దరిద్రం- పల్లా శ్రీనివాస్
విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ... జగన్ మా భవిష్యత్తు కాదు మా దరిద్రం అని ప్రజలనుకుంటున్నారన్నారు. సంక్షేమం పేరుతో డబ్బులు పంచడం కాదు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో యువత గంజాయి మత్తుకు బానిసలు అవుతున్నారని, యువతకు ఉపాధి కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. జగన్ ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా మోసగిస్తోందన్నారు. ఈ సమావేశంలో జిల్లా తెలుగుమహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి దక్షిణ నియోజకవర్గం తెలుగుమహిళా అధ్యక్షురాలు కెదారి లక్ష్మి ఇతర నాయకులు పాల్గొన్నారు.