Minister Botsa :విశాఖలో ముఖ్యమంత్రి అధికారిక నివాసం కడితే తప్పు ఏంటో చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విశాఖలో మాట్లాడిన ఆయన... ముఖ్యమంత్రి కార్యాలయం రుషికొండపై కడితే తప్పు ఏమిటని నిలదీశారు. రుషికొండలో మరో గెస్ట్ హౌస్ కడుతున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణకు భంగం కలిగితే ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. సీఎం జగన్ గడపగడపకు ప్రభుత్వం వర్క్ షాప్ పై అత్యుత్సాహం సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 175 సీట్లు టార్గెట్ గా పెట్టుకోకూడదా? అని ప్రశ్నించారు. సంక్షేమంపై ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చామన్నారు. ఏవో ఒకటి రెండు ఉద్యోగులు విషయాల్లో పెండింగ్ ఉన్నాయన్నారు.
అది టీడీపీ పాదయాత్ర
"అమరావతి రైతుల ముసుగులో టీపీపీ పాదయాత్ర చేస్తోంది. విశాఖ రాజధాని వద్దు అని ఉత్తరాంధ్రకు యాత్రగా వస్తుంటే వారిని ఏమనుకోవాలి. అచ్చెన్నాయుడు మహా జ్ఞాని, మేము అజ్ఞానాలమా? విశాఖకు టీడీపీ నేతలు ఏంచేశారో చెప్పాలి. రాజశేఖర్ రెడ్డి హయాంలో విశాఖ, రాష్ట్రం అభివృద్ధి చెందాయి. విమ్స్, హెల్త్ సిటీ, ఫార్మా సిటీ, ఐటీ సెజ్, ప్రైవేట్ పోర్ట్ వంటివి మేము చేశాం. హుద్ హుద్ తుఫాన్ టైమ్ లో తప్పుడు లెక్కలతో టీడీపీ నేతలు దోచుకుతిన్నారు. పరిహారం అడిగితే రికార్డులు పోయాయి అన్నారు. రుషికొండలో గతంలో ఏముంది? మేం మరో గెస్ట్ హౌస్ కడుతున్నాం అందులో తప్పు ఏంటి?." - మంత్రి బొత్స సత్యనారాయణ
సీఎం అధికారిక నివాసం కడితే తప్పు ఏంటి?
"ముఖ్యమంత్రి అధికారిక నివాసం కడితే తప్పు ఏంటో చెప్పాలి. పర్యావరణ పరిరక్షణకు భంగం కలిగితే ప్రభుత్వం చూసుకుంటుంది. అక్కడ చర్చి, మసీదు ఉందా? ముఖ్యమంత్రి కార్యాలయం రుషికొండపై కడితే తప్పు ఏమిటి? . విశాఖ రాజధాని అడ్డుకుంటే చరిత్రహీనులుగా మిగులుతారు. విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని దోచుకుతిన్నారు టీడీపీ నేతలు. మమ్మల్ని హేళన చేయడానికి అశోక్ గజపతి విజయనగరానికి ఏంచేశారు. యూనివర్సిటీ, మెడికల్ కాలేజీ, నీటిపారుదల ప్రాజెక్టులు తెచ్చాం. ఏం ముఖం పెట్టుకొని అశోక్ మాపై మాట్లాడుతారు. విశాఖకు ఎందుకు రాజధాని వద్దో టీడీపీ నేతలు స్పష్టం చేయాలి. ఉత్తరాంధ్ర అభివృద్ధి వద్దనడానికి సిగ్గు అనిపించడం లేదా? "- మంత్రి బొత్స సత్యనారాయణ
రుషికొండపై క్షుద్రపూజలు చేయడంలేదుగా?
టీడీపీ ఎన్ని ఠక్కు టమారా విద్యలు చేసినా రాజధాని విశాఖ రావడం ఖాయమని మంత్రి బొత్స అన్నారు. గంజాయిపై ఎక్కువగా దాడులు చేస్తున్నామని, అందుకే కేసులు పెరుగుతున్నాయన్నారు. దాన్ని కూడా రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలపై స్వయంగా తానే తీసుకెళ్లి చూపిస్తానన్నారు. రుషికొండ పై క్షుద్రపూజలు చేయడం లేదు కదా అన్నారు. రుషికొండపై పాత నిర్మాణాల స్థలంలోనే ఎందుకు కట్టాలని ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వమే కడుతుంటే తప్పు ఏముందని నిలదీశారు. అది టూరిజిమ్ గెస్ట్ హౌస్ గానో, ప్రభుత్వ కార్యాలయం కడితే తప్పు ఏమిటో టీడీపీ నేతలు చెప్పాలని మంత్రి ప్రశ్నించారు.