Vishnu Kumar Raju : వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి సీఎం జగన్ విశాఖ రాజధానిగా పరిపాలన సాగిస్తారని ప్రచారం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన... ముఖ్యమంత్రి వచ్చి విశాఖలో కూర్చుని పరిపాలన ప్రారంభిస్తే ఎవరు అడ్డుకోలేరన్నారు. బీజేపీ మాత్రం విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను అంగీకరించేది లేదన్నారు. రుషికొండలో నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచే పరిపాలన ప్రారంభంకావొచ్చన్నారు. రెండు వేల రూపాయలు నోట్లు బ్యాంకుల్లో లేవని, మార్కెట్లలోనూ కనిపించడం లేదన్నారు. పెద్ద నోట్లను ఎవరు బ్లాక్ చేశారో తేల్చేందుకు ఆర్బీఐ విచారణ జరిపించాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ పెద్ద ఎత్తున జరుగుతోందని ఆరోపణలు చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.
సీఎం జగన్ సభకు డ్రెస్ కోడ్
"సీఎం జగన్ సభకు హాజరయ్యే ప్రజలకు డ్రెస్ కోడ్ ప్రకటిస్తూ ప్రభుత్వం ఒక జీవో జారీ చెయ్యాలి. నరసాపురం సభకు వచ్చిన మహిళల బ్లాక్ చున్నీలు తీయించి వెయ్యడం సిగ్గుచేటు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ కళ్లకు ఈ చర్యలు తప్పు అనిపించలేదా? పవన్ కల్యాణ్ పై అనవసరంగా విరుచుకుపడుతున్న వాసిరెడ్డి పద్మకు నరసాపురంలో జరిగిన దారుణం కనిపించలేదా?. బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం ఇక్కడ మా నాయకులను జైలు పాలు చేస్తుంటే సహించలేం. దశపల్లా భూములపై కలెక్టర్ కు రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఉండాలి. కానీ వైసీపీ ప్రభుత్వానికి ప్రతిపక్షాల మాటలు నచ్చవు. నర్సాపురంలో జరిగిన ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. క్షమాపణలు చెప్పాలి. ప్రతిపక్ష నేతల ఎంత మొరపెట్టుకున్నా అధికారులు స్పందించడంలేదు. "- విష్ణు కుమార్ రాజు
సీఎం పర్యటన అంటే ప్రజల్లో ఆందోళన
నిండు సభలో మహిళల చున్నీలు తీయించడంపై మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు ఎందుకు స్పందించడంలేని విష్ణు కుమార్ రాజు ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలు సిగ్గుతో తలవొంచుకోవాల్సి పరిస్థితులు ఉన్నాయన్నారు. సీఎం జగన్ కు ఈ విషయం తెలియకపోవచ్చని, ప్రతిపక్ష పార్టీలను పిలిచి అడిగితే ఇలాంటి దారుణ చర్యలు ఎన్నో చెబుతారన్నారు. సీఎం జగన్ పర్యటన ఉందంటే ఏదో భయంకర వాతావరణ సృష్టిస్తున్నారని ఆరోపించారు. నర్సాపురం పర్యటనలో ఒకరోజు ముందే బారికేడ్లు వేసి ప్రజలకు భయాందోళనకు గురిచేశారని మండిపడ్డారు. బీజేపీ నేతలు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారని, సభ జరిగిన రోజున హౌస్ అరెస్టు చేశారన్నారు. కేంద్రంలో బీజేపీతో మాకు సత్సంబంధాలు ఉన్నాయని చెబుతున్న వైసీపీ బీజేపీ నేతలను అరెస్టు చేస్తుందని ఆరోపించారు. సీఎం జగన్ వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని హితవు పలికారు. సీఎం జగన్ ఘోర ప్రభావం తప్పదని, అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు.