Tahsildar Ramanaiah Funeral: విశాఖ రూరల్ జిల్లాలో దారుణ హత్యకు గురైన తహసీల్దార్ రమణయ్య అంత్యక్రియలు శనివారం సాయంత్రం ఆయన స్వగ్రామంలో ముగిశాయి. ఎమ్మార్వో హత్యను నేతలంతా ఖండించారు. విశాఖ కేజీహెచ్ లో ఎమ్మార్వో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆయన పార్థీవ దేహాన్ని స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లాకు తరలించారు. టెక్కలి నియోజకవర్గం నందిగామ మండలం దిమ్మలాడలో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థుల అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ ఘటనతో గ్రామమంతా తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయింది. స్వగ్రామం చేరిన మృతదేహాన్ని చూసిన కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. చిన్న వయసులోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించిన రమణయ్య.. పెద్దస్థాయికి చేరుకుంటాడని భావించామని.. ఇలా మృత్యువాత పడడం తట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రమణయ్యను కడసారి చూసేందుకు సమీప గ్రామాల నుంచి జనం వెల్లువలా వచ్చారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, పార్లమెంట్ ఇంఛార్జీ పేరాడ తిలక్ సహా ఇతర పార్టీల నేతలు ఆయన స్వగ్రామానికి చేరుకుని మృతదేహానికి నివాళులు అర్పించారు. రమణయ్య కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. 


నిందితున్ని గుర్తించామన్న పోలీసులు


మరోవైపు, తహసీల్దార్ ను దారుణంగా హత్య చేసిన నిందితున్ని గుర్తించామని విశాఖ సీపీ రవిశంకర్ (Ravi Shankar) వెల్లడించారు. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేకంగా ఇద్దరు ఏసీపీలను నియమించినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు వివరాలను శనివారం మధ్యాహ్నం మీడియాకు వివరించారు. 'ఎమ్మార్వో రమణయ్యను హత్య చేసిన నిందితుడిని గుర్తించాం. నిందితుడు ఎయిర్ పోర్ట్ వైపు ప్రయాణించినట్లు గుర్తించాం. టికెట్ బుక్ చేసినట్లు ఆధారాలు లభించాయి. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి అన్ని ప్రాంతాల్లోనూ గాలింపు చర్యలు చేపట్టాం. చాలాసార్లు ఎమ్మార్వో ఆఫీస్ కు నిందితుడు వెళ్లినట్లు తేలింది. త్వరలోనే నిందితున్ని పట్టుకుంటాం.' అని సీపీ స్పష్టం చేశారు. 


అదే కారణమా.?


శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ హత్య జరిగిందని.. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి వెంటనే వెళ్లారని సీపీ తెలిపారు. ఈ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని భావిస్తున్నట్లు చెప్పారు. 'రియల్ ఎస్టేట్, భూ వివాదాలే హత్యకు కారణమై ఉండొచ్చు. హత్యకు ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. తనతో మాట్లాడడానికి వచ్చిన వారికి తహసీల్దార్ సెండాఫ్ చెప్పడానికి వెళ్లగా.. అదే అదనుగా నిందితుడు హత్య చేశాడు.' అని సీపీ వివరించారు.