YSRCP Reaction On Posani Arrest:సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టును వైఎస్‌ఆర్‌సీపీ తీవ్రంగా ఖండించింది. గత వారం వంశీని ఇలానే అరెస్టు చేశారు. ఇప్పుడు పోసాని కృష్ణమురళిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఇంకా ఎన్ని రోజులు చేస్తారంటూ ప్రశ్నిస్తోంది. 

పోసాని అరెస్టును తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. అందులో ఏం రాసిందంటే"పోసాని కృష్ణమురళి హైదరాబాద్ గచ్చిబౌలిలోని తన నివాసంలో అక్రమ అరెస్ట్. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించాడనే కారణంతో కక్ష సాధిస్తూ తప్పుడు కేసులు.  పోసానికి ఆరోగ్యం బాలేదని అతని సతీమణి చెప్తున్నా.. దురుసుగా ప్రవర్తిస్తూ గచ్చిబౌలిలోని ఆయన నివాసం నుంచి తీసుకెళ్లిన అనంతపురం పోలీసులు. ఇలా ఇంకెంత కాలం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తావ్ బాబు ?" అని ప్రశ్నించింది. 

హైదరాబాద్‌లోని మైహోం భుజాలో తన నివాసం ఉన్న టైంలో అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ని అన్నమయ్య జిల్లాకు తరలించారు. అక్కడ న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. అరెస్టు నోటీసు ఇచ్చిన పోలీసులు రేపటి తేదీ వేసి ఉండటంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అంతే కాకుండా ఆయన్ని అరెస్టు సందర్భంగా ఇచ్చిన నోటీసులో ఒక పేరు ఉంటే కుటుంబ సభ్యులకు ఇచ్చిన ఫోన్‌ నెంబర్లు ఒక పోలీస్‌ స్టేషన్‌వి అని అంటున్నారు. పోసాని అరెస్టును మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఖండించారు. అసలు ఆయన్ని ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. అరెస్టు సందర్భంగా కనీస చట్టాన్ని కూడా గౌరవించడం లేదని ఆరోపించారు. రెడ్‌ బుక్ రాజ్యాన్ని నడిపిస్తూ ఎలాంటి కారణాలు చెప్పకుండానే నేతలను లిఫ్ట్ చేస్తున్నారని మండిపడ్డారు.