Posani Krishna Murali Arrest: రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేసులో పోసాని కృష్ణ మురళి అరెస్టును వైసీపీ అధినేత జగన్ ఖండించారు. పోసాని భార్య కుసుమలతను ఫోన్‌లో పరామర్శించారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 

బుధవారం రాత్రి పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో వైసీపీ ఘాటుగా రియాక్ట్ అవుతుంది. ఆ పార్టీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డి పోసాని భార్య కుసుమలతతో మాట్లాడారు. ఫోన్‌లో ఆమెను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాజంపేటకు పార్టీ తరఫున న్యాయవాదులను పంపిస్తున్నట్టు తెలిపారు. జరుగుతున్నదంతా దేవుడు చూస్తున్నాడని చెప్పారు. 

పోసాని భార్యతో మాట్లాడిన జగన్‌ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందని ఆరోపించారు. ఇలాంటి పాలన ఎల్లకాలం సాగదని మంచి రోజులు వస్తాయని ఆమెను ఓదార్చారు.  

Also Read: సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టు- మీరెవరు అంటూ పోలీసులతో వాగ్వాదం

జగన్‌తోపాటు వైసీపీ నేతలంతా పోసానికి మద్దతుగా నిలుస్తున్నారు. వుయ్ స్టాండ్ విత్ పోసాని అంటూ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అందుకే ప్రశ్నించే వాళ్లను అరెస్టు చేస్తున్నారని మండిపడుతున్నారు. కుట్రలో భాగంగానే పోసాని కృష్ణ మురళి అక్రమంగా అరెస్టు చేశారని అంటున్నారు. బుధవారం రాత్రి పోసానిని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ.. అతని కుటుంబ సభ్యులకి ఇచ్చిన నోటీసుల్లో మాత్రం గురువారం అరెస్ట్ చేసినట్లు పేర్కొనడం కుట్ర తెలుస్తోందన్నారు.  

దీనికి కూటమి పార్టీల నుంచి కూడా ఘాటుగా కౌంటర్‌లు పడుతున్నాయి. గతంలో పోసాని చేసిన వ్యక్తిగత కామెంట్స్‌ గుర్తు చేస్తున్నారు టీడీపీ, జనసేన మద్దతుదారులు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారికి మద్దతు తెలపడానికి సిగ్గుగా లేదా అంటు నిలదీస్తున్నారు. 

2019 ఎన్నికలకు ముందు నుంచి వైసీపీకి మద్దతు ప్రకటించిన పోసాని తరచూ ప్రత్యర్థులపై విమర్శలు చేసే వారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విమర్శలు డోస్ మరింతగా పెంచారు. చంద్రబాబు, పవన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కటువుగా మోటు కామెంట్స్ చేశారు. ఇది ఆయన్ని ఇప్పుడు చిక్కుల్లో పడేసింది. జగన్ అధికారం కోల్పోయిన తర్వాత తనకు వచ్చిన ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత పెట్టిన ప్రెస్‌మీట్‌లో కూడా తన విమర్శల వాడి తగ్గలేదు. మొన్నీ మధ్య శ్రేయోభిలాషుల సూచన మేరకు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇకపై రాజకీయాల్లో ఉండనని ప్రకటించారు. ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయబోనని తెలిపారు. అయినా ఆయనపై నమోదు అయిన కేసుల్లో ఇప్పుడు అరెస్టు అయ్యారు. 

Also Read: శ్రీకాకుళం నుంచి అనంత వరకు పోసానిపై నమోదైన కేసులు చిట్టా ఇదే!